ప్రధాని మోదీ తన మంత్రివర్గ ప్రక్షాళనకు సిద్దమవుతున్నారు. మూడో సారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న వేళ.. మంత్రివర్గంతో పాటుగా పార్టీని ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది. ఈ నెల 10న ఎన్డీఏ సీఎంలు.. డిప్యూటీ సీఎంల తో మోదీ సమావేశం కానున్నారు. కీలక బిల్లుల ఆమోదం.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలే లక్ష్యంగా కేబినెట్ లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ నుంచి మార్పులు ఖాయమని తెలుస్తోంది.
కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు ముహూర్తం దాదాపు ఖరారైంది. ఈ నెల 15వ తేదీ కేబినెట్ విస్తరణ తో కొత్త గవర్నర్ల నియామకం పైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కనీసం ఐదారుగురు కేబినెట్ మంత్రులు, 12 మంది సహాయ మంత్రులను తొలగించనున్నట్లు సమాచారం. వీరిలో కొందరికి పార్టీ బాధ్యతలు కట్టబెడతారని.. ఈనెల 20వ తేదీ తర్వాత ఎప్పుడైనా మంత్రివర్గ పునర్వ్యవస్థీక రణ చేపట్టవచ్చని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఢిల్లీలో పార్టీ ఆఫీసు బేరర్లు, రాష్ట్ర అధ్యక్షులతో చర్చలు జరిపారు. ఏపీ, తెలంగాణ నుంచి ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో అయిదుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు శాఖలు మారుతాయనే ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్, పెమ్మసాని కొనసాగటం ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, తెలంగాణ నుంచి కొత్తగా మరో సహాయ మంత్రిగా అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసిన బీజేపీ నాయకత్వం 2028 ఎన్నికలే లక్ష్యంగా మరో మంత్రిని ఎంపిక చేసే అవకాశం ఉంది. కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే.. ఆ స్థానంలో డీకే అరుణకు ఛాన్స్ దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ధర్మపురి అర్వింద్, ఈటల సైతం మంత్రి వర్గంలో స్థానం కోసం రేసులో ఉన్నారు. ఇక.. ఏపీ నుంచి మరో సహాయ మంత్రి పదవి దక్కనుంది. ప్రస్తుతం టీడీపీ నుంచి ఇద్దరు.. బీజేపీ నుంచి ఒకరు కేబినెట్ లో కొనసాగుతున్నారు. కాగా.. ఏపీ నుంచి జనసేన లేదా బీజేపీ నుంచి మరొకరికి అవకాశం వస్తుందని భావిస్తున్నారు. జనసేనకు ప్రాతినిధ్యం ఇస్తారని చెబుతున్నారు. అయితే.. ఏపీలో సామాజిక – ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా ఎవరికి అవకాశం ఇవ్వాలనేది డిసైడ్ చేయనున్నారు. ఈ సారి కేబినెట్ లో ఎస్సీ వర్గానికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుత కేబినెట్ లో ఇద్దరు సీనియర్లను గవర్నర్ గా పంపే ఆలోచనతో మోదీ – షా ద్వయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10న ఎన్డీఏ భేటీలో ఈ మొత్తం మార్పులు – చేర్పుల పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
