ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపిన కల్తీ మద్యం కేసు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) దర్యాప్తు కోరుతూ జోగి రమేష్ వేసిన పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.
పిటిషన్ను విచారించిన హైకోర్టు, ఈ నెల 26వ తేదీన కౌంటర్ దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం, హోం శాఖ మరియు డీజీపీని ఆదేశించింది.
నకిలీ మద్యం కేసును రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారిస్తోందని, అయితే ఈ విచారణ ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతూ దారి తప్పుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అంతేకాకుండా, సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ వేసిన వ్యక్తిని కూడా నిందితుడిగా అరెస్ట్ చేశారని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఈ వాదనలు విన్న హైకోర్టు, సిట్ విచారణ తీరు ఎలా ఉంది? నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం ఉందా లేదా? అనే అంశాలపై స్పష్టతనిస్తూ పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఈ కేసు దర్యాప్తు విషయంలో తదుపరి కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
