మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులను వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి దుర్మార్గమైన పరిణామాలు ఎన్నడూ చూడలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇళ్లపై దాడులు చేయడం, పెట్రోల్ బాంబులు విసరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో అసలు పోలీసులు ఉన్నారా? శాంతి భద్రతలు ఎవరు కాపాడుతున్నారని ఆయన నిలదీశారు.
ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న ఈ దాడులు ప్రజాస్వామ్యంపై జరిగిన దాడులేనని బొత్స స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ దౌర్జన్యాలను జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు వైసీపీ వెనుకాడదని చెప్పారు. ఈ అంశంపై రేపు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించి, తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, అనంతపురంలో వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టారు. చంద్రబాబు బీసీ వ్యతిరేకి, రాష్ట్రాన్ని ఆటవిక రాజ్యంగా మార్చారని నినాదాలు చేశారు. అనంతపురం జెడ్పీ కార్యాలయంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఎదుట వైసీపీ నేతలు నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని వైసీపీ నేతలు స్పష్టం చేశారు.
