విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం కొత్త స్కెచ్ వేసింది. నేరుగా ప్రైవేట్ పరం చేయకుండా ‘పరోక్ష ప్రైవేటీకరణ’ మార్గాన్ని ఎంచుకుంటూ ప్లాంట్‌ను ప్రైవేట్ శక్తుల చేతుల్లోకి నెట్టేందుకు ప్రయత్నిస్తోందనే ఆందోళన కార్మిక వర్గాల్లో తీవ్రంగా వ్యక్తమవుతోంది.
ప్లాంట్ మనుగడ సాగించడానికి అవసరమైన పెట్టుబడులు, నిధులు…ముడిసరుకును టాయించకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ప్లాంట్ ఆర్థికంగా మరింత నష్టాల్లోకి కూరుకుపోయేలా చేయడమే కేంద్రం ప్లాన్ అని కార్మికులు ఆరోపిస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం తీవ్రమైన వర్కింగ్ క్యాపిటల్ కొరతను ఎదుర్కొంటోంది. అవసరమైన ముడిసరుకును కొనుగోలు చేయలేకపోవడం వల్ల ప్లాంట్‌లోని కొన్ని బ్లాస్ట్ ఫర్నేస్‌లు ఇప్పటికే మూతపడ్డాయి. దీనివల్ల ఉక్కు ఉత్పత్తి భారీగా పడిపోయింది. దేశంలోని మిగతా ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థలతో పోలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంతంగా ఇనుప గనులు లేవు. దీనివల్ల మార్కెట్లో ఎక్కువ ధర పెట్టి ముడిసరుకును కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది ప్లాంట్‌కు అదనపు ఆర్థిక భారంగా మారింది. సొంత గనులను కేటాయించాలనే దశాబ్దాల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టింది.
ప్లాంట్ నిర్వహణ కోసం టాటా స్టీల్ లేదా జిందాల్ వంటి ప్రైవేట్ సంస్థలతో చేతులు కలపడం లేదా జాయింట్ వెంచర్ల వైపు అడుగులు వేయడంపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది పరోక్షంగా ప్లాంట్‌ను ప్రైవేటీకరించడమేనని చెబుతున్నారు. ప్లాంట్‌ను నష్టాల నెపంతో ప్రైవేట్ పరం చేస్తే వేలాది మంది కార్మికుల భవిష్యత్తు అంధకారమవుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
