తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, ప్రజలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇకపై రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు జొన్నలు, మొక్కజొన్నలను కూడా పంపిణీ చేయాలని నిర్ణయించింది.
ఇటీవల జరిగిన ‘రిసోర్స్ మొబిలైజేషన్’ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ అంశంపై అధికారులకు కీలక సూచనలు చేశారు. మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల నుంచి సేకరించిన ఈ ధాన్యాలను కేవలం మార్కెట్ వస్తువులుగా చూడకుండా, పేద ప్రజల ఆకలి తీర్చే వనరులుగా ఉపయోగించాలని ఆయన పేర్కొన్నారు.
సేకరించిన ధాన్యాన్ని బహిరంగ వేలం వేస్తే మధ్యవర్తులు లాభపడే అవకాశం ఉంటుంది. దానికి బదులుగా నేరుగా ప్రజలకు పంపిణీ చేయడం ద్వారా లబ్ధిదారులకు మేలు జరుగుతుంది.జొన్నలు, మక్కలు తీసుకోవడం వల్ల ప్రజలు, ముఖ్యంగా నిరుపేదలు ఆరోగ్యంగా ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకు వీటి ద్వారా బలవర్ధకమైన ఆహారాన్ని అందించనున్నారు. మొక్కజొన్నలను నేరుగా పౌల్ట్రీ రైతులకు కేటాయించడం ద్వారా అటు రైతులకు, ఇటు అనుబంధ రంగాలకు మేలు చేకూరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు పారిశ్రామిక ప్రగతి, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది రేషన్ కార్డు దారులకు లబ్ధి చేకూరనుంది.
