తెలంగాణ రాజకీయాల్లో ఉప ఎన్నికల సందడి నెలకొంది .త్వరలో జూబ్లీహిల్స్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండగా వీటితో పాటు గోషామహల్, ఖైరతాబాద్ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే రాజాసింగ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా ఇవాళ ఆ రాజీనామాను అమోదించింది బీజేపీ. దీంతో గోషామహల్ స్థానానికి ఉప ఎన్నిక జరగడం అనివార్యం కానుంది.
ఈ రెండు జూబ్లీహిల్స్, గోషామహల్ స్థానాలను పక్కకు పెడితే మరో స్థానానికి కూడా ఉప ఎన్నిక జరుగుతుందని టాక్ నడుస్తోంది. అదే ఖైరతాబాద్. ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు దానం నాగేందర్. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన దానం.. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు. అంతేగాదు లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుండి కాంగ్రెస్ తరపున ఎంపీగా సైతం పోటీచేశారు.
ఇక కాంగ్రెస్‌లో చేరినప్పుడే మంత్రి పదవిపై స్పష్టమైన హామీ ఇవ్వగా ఇప్పుడు పార్టీ ఫిరాయింపు అంశం సుప్రీం కోర్టులో ఉండటంతో కేబినెట్ బెర్త్ ఉగిసలాడుతోంది. ఈ నేపథ్యంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయాలని చూస్తున్నారు దానం. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపిస్తా.. ఖైరతాబాద్‌లో తాను మళ్లీ పోటీ చేసి గెలుస్తా.. గతంలో తనకు ఇచ్చిన విధంగా మంత్రి పదవిని ఇవ్వాడలని కండీషన్ పెడుతున్నారట.
ఈ వారం రోజుల్లోనే దానం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశ ఉండగా ఈ నెలాఖరులో చేపట్టే మంత్రివర్గ విస్తరణలో బెర్త్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఎమ్మెల్యేగా రాజీనామా చేశాక..వచ్చే ఉపఎన్నికల్లో మంత్రిపదవి హోదాలోనే దానం బైపోల్ బరిలో దిగనున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి కాంగ్రెస్ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.
