కడప జిల్లా రాజకీయ సంచలనాలకు కేంద్రబిందువు రాయచోటి. రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉండే ఈ నియోజకవర్గంలో ఎక్కువ సార్లు కాంగ్రెస్ గెలుపొందింది. ఆ తర్వాత టీడీపీ పలుమార్లు గెలుపొందిన 2009లో గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎంట్రీతో పొలిటికల్ ముఖచిత్రం మారిపోయింది. అప్పటి నుండి ఆయనే గెలుస్తూ వస్తున్నారు.
2009,2012 ఉప ఎన్నికలు,2014,2019 వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు శ్రీకాంత్ రెడ్డి. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఓ విధంగా చెప్పాలంటే రాయచోటిని తన కంచుకోటగా మార్చుకున్నారు శ్రీకాంత్ రెడ్డి. ఈ నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 31 వేల 637 ఓట్లు ఉండగా..ఈసారి టీడీపీ నుండి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పోటీలో ఉన్నారు.
ఇక తనకు టీడీపీ నుండి టికెట్ దక్కకపోవడంతో రెడ్డప్పగారి రమేశ్‌రెడ్డి వైసీపీ గూటికి చేరిపోయారు. ఇది కూడా ఓ రకంగా టీడీపీకి ప్రతికూలంగా మారిందనే చెప్పుకోవాలి. ఇక నియోజకవర్గ అభివృద్ధిలో తన మార్క్ స్పష్టంగా చూపించారు శ్రీకాంత్ రెడ్డి. నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లా కేంద్రం చేయడం, జగన్ సంక్షేమం వెరసీ శ్రీకాంత్ రెడ్డిని ఓడించడం అంతా ఈజీ కాదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇక పోలింగ్ తర్వాత కూడా ప్రజలంతా శ్రీకాంత్ రెడ్డి వైపే ఉన్నారని తెలుస్తోంది. మరి రాయచోటిలో ప్రజలు మార్పు కోరుకున్నారా లేదా శ్రీకాంత్ రెడ్డి వైపే నిలిచారా అన్నది జూన్ 4న తేలనుంది.
