కేరళ రాష్ట్ర ఎన్నికలకు ముందు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ రాష్ట్రానికి ‘Kerala’ బదులుగా ‘Keralam’గా పేరు మార్చేందుకు ఆమోదం తెలిపింది. జూన్ 24, 2024న కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా రాష్ట్ర పేరు మార్పుకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. ఆ తీర్మానాన్ని అనుసరించి మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర పేరు మార్పుకు ఆమోదం తెలిపింది.
ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ “Kerala ను Keralam గా మార్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది అని వెల్లడించారు. ఏప్రిల్–మేలో జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ప్రారంభించిన కొత్త ప్రధానమంత్రి కార్యాలయ భవనం ‘సేవా తీర్థ్’లో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలి తీర్మానాన్ని పరిశీలించిన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొన్ని సాంకేతిక మార్పులు సూచించడంతో అసెంబ్లీ రెండోసారి తీర్మానం ఆమోదించింది.
కేబినెట్ సమావేశం అనంతరం అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ…దేశంలోని 140 కోట్ల ప్రజలకు సేవాభావంతో ప్రతి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాజ్యాంగ విలువలు ప్రజల గౌరవం, సమానత్వం, న్యాయం అనే మౌలిక సూత్రాలకు ప్రతిబింబమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానంలో, మలయాళంలో రాష్ట్రాన్ని ‘Keralam’గా పిలుస్తారని, స్వాతంత్ర్య సమర కాలం నుంచే ఐక్య కేరళ డిమాండ్ ఉన్నదని వివరించారు. రాజ్యాంగ తొలి షెడ్యూల్‌లో ‘Kerala’గా ఉన్న పేరును ఆర్టికల్ 3 ప్రకారం సవరించి, ఎనిమిదో షెడ్యూల్‌లోని అన్ని భాషల్లోనూ ‘Keralam’గా మార్చాలని అసెంబ్లీ కేంద్రాన్ని కోరింది. 2023 ఆగస్టులో కూడా ఇలాంటి తీర్మానం ఆమోదించి పంపిన విషయం తెలిసిందే.
