తెలంగాణ శాసనమండలిలో ప్రసంగిస్తూ ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధానంగా బీఆర్ఎస్ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తూ… కాంగ్రెస్, బీజేపీ పార్టీల తీరును ఎండగట్టారు. అంతేగాదు శాసనమండలిలో ఇదే తన చివరి ప్రసంగమని .. మధ్యలో కంటతడి పెట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి తాను చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
అనంతరం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆంక్షల మధ్యే నా ప్రయాణం.. ప్రసంగం సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ గారి స్ఫూర్తితోనే నేను ఉద్యమంలోకి వచ్చాను. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే నాపై అనేక ఆంక్షలు మొదలయ్యాయి అన్నారు.
పార్టీలో నా గళాన్ని వినిపించినప్పుడు, ప్రశ్నించినప్పుడు నాపై కక్ష గట్టారు. సొంత పార్టీ బీఆర్‌ఎస్ నుంచి కూడా నేను అనేక కట్టుబాట్లు, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి జైలులో పెట్టినా పార్టీ అండగా నిలబడలేదన్నారు.
రాజీనామాను ఆమోదించండి.. గతేడాదే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని గుర్తు చేసిన కవిత, తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని మండలి ఛైర్మన్‌ను కోరారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన బీఆర్‌ఎస్ పార్టీకి, నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
