ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జాతీయ గీతం “వందే మాతరం”కు 150 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా సంవత్సరం పొడవునా జరపబోయే ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. 1937లో వందే మాతరంలోని ముఖ్యమైన శ్లోకాలు తొలగించడం భారత విభజనకు విత్తనాలు వేసిందని ప్రధాని మోదీ అన్నారు.
కొత్త భారతానికి కాంగ్రెస్ పార్టీ “విభజనాత్మక మనస్తత్వం” పెద్ద సవాలుగా ఉందని ఆయన పేర్కొన్నారు. వందే మాతరం స్వాతంత్ర్య పోరాటపు స్వరంగా మారింది, అది ప్రతి భారతీయుడి భావోద్వేగాలను ప్రతిబింబించింది. కానీ దురదృష్టవశాత్తూ, 1937లో వందే మాతరంలోని ఆత్మను తీసేశారు అన్నారు. వందే మాతరాన్ని విభజించడం వల్లే విభజన విత్తనాలు పడ్డాయి. ఈ ‘దేశ నిర్మాణ మహామంత్రం’పై జరిగిన ఈ అన్యాయాన్ని నేటి తరం తెలుసుకోవాలి. ఈ విభజనాత్మక దృక్పథం దేశానికి ఇప్పటికీ సవాలుగా ఉంది అని ప్రధాని మోదీ అన్నారు.
ప్రధాని వ్యాఖ్యలు BJP అధికార ప్రతినిధి సి.ఆర్. కేసవన్ చేసిన ఆరోపణల అనంతరం వెలువడ్డాయి. మాజీ ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ..దుర్గాదేవిని స్తుతించే వందే మాతరంలోని శ్లోకాలను ఉద్దేశపూర్వకంగా తొలగించారు అని కేసవన్ ఆరోపించారు. 1937 సెప్టెంబర్ 1న నెహ్రూ వ్రాసిన ఒక లేఖలో, వందే మాతరంలోని పదాలు దేవతతో సంబంధముందని భావించడం ‘హాస్యాస్పదం’ అని పేర్కొన్నారు అంటూ కేసవన్ ఎక్స్ (X)లో ఆ లేఖ భాగాలను పంచుకున్నారు.
కేసవన్ మరో ట్వీట్‌లో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాత్రం పూర్తి వందే మాతరంను విడుదల చేయాలనే అభిప్రాయంలో ఉన్నారని చెప్పారు.వందే మాతరం ఏ మతానికీ, ఏ భాషకీ చెందినది కాదు. కానీ కాంగ్రెస్, నెహ్రూ నాయకత్వంలో, మతపరమైన కారణాలను చూపుతూ దుర్గామాతను స్తుతించే శ్లోకాలను ఉద్దేశపూర్వకంగా తొలగించింది. ఇది చారిత్రాత్మక తప్పిదం అని కేసవన్ అన్నారు.
1937 అక్టోబర్ 20న నెహ్రూ నేతాజీ బోస్‌కు రాసిన లేఖలో, వందే మాతరం నేపథ్యం ముస్లింలను బాధించవచ్చని పేర్కొన్నారు. వందే మాతరంపై ఉన్న వ్యతిరేకతకు కొంత సారాంశం ఉందని కూడా చెప్పారు అని ఆయన వెల్లడించారు. BJP ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ నేత సందీప్ దిక్షిత్ మాట్లాడుతూ, జాతీయ గీతమైన జన గణ మన కూడా ప్రతి సారి పూర్తి రూపంలో పాడబడదు. అదే విధంగా వందే మాతరంలో కొన్ని శ్లోకాలు మాత్రమే పాడబడ్డాయి. ఇది ఎలాంటి తప్పు కాదు అన్నారు.
