ఎన్‌సీఈఆర్టీ 8వ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో “న్యాయవ్యవస్థలో అవినీతి” అనే అధ్యాయాన్ని చేర్చిన విషయంపై సుప్రీంకోర్టు స్వయంగా (సువో మోటో) విచారణకు దిగింది. ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్,…ఏ సంస్థనైనా అపకీర్తి చేయడానికి నేను అనుమతించను. చట్టం తన ప్రకారం నడుస్తుంది అని స్పష్టం చేశారు.
సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మనుసింగ్‌వి ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌తో పాటు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలితో కూడిన బెంచ్ ముందు ఈ విషయాన్ని ప్రస్తావించారు. చిన్నారులకు చదువుతున్న దశలోనే న్యాయవ్యవస్థలో అవినీతి గురించి బోధించడం ఆందోళనకరమని వారు పేర్కొన్నారు.
దీనికి స్పందించిన సీజేఐ సూర్యకాంత్, తాను ఈ విషయాన్ని గమనించానని, పలువురు న్యాయమూర్తులు కూడా పుస్తకంలోని విషయాలపై అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. కొన్ని రోజులు వేచి చూడండి. బార్ అండ్ బెంచ్ అంతా ఆందోళన చెందుతోంది. అన్ని హైకోర్టు న్యాయమూర్తులు కూడా కలవరపడుతున్నారు. నేను ఈ విషయాన్ని సువో మోటోగా తీసుకుంటాను అని అన్నారు. జస్టిస్ బాగ్చి వ్యాఖ్యానిస్తూ, ఈ అధ్యాయం రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణ సూత్రాలకు విరుద్ధంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
అయితే పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లుగా అవినీతి, పెండింగ్ కేసుల భారీ సంఖ్య, తగినంత న్యాయమూర్తుల కొరత వంటి అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సుమారు 81,000 కేసులు, హైకోర్టుల్లో 62.40 లక్షలు, జిల్లా మరియు ఉపకోర్టుల్లో సుమారు 4.70 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పుస్తకంలో పేర్కొన్నారు.
