ఏపీని నైరుతి రుతుపవనాలు తాకాయి. రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను రుతుపవనాలు తాకగా రానున్న రెండుమూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు మరింత విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
రుతుపవనాలు విస్తరించే క్రమంలో రానున్న రెండు రోజుల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇవాళ పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఓ వైపు వర్షాలు పడుతున్న మరోవైపు ఎండల తీవ్రత కూడా ఉంటుందని ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, కాకినాడ, పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 104 మండలాల్లో వడగాలులు ప్రభావం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసి, మరికొన్ని రోజుల పాటు వాతావరణం పొడిగా ఉండే సూచనలు ఉన్నాయని తెలిపారు.
ఈసారి జూన్ – సెప్టెంబరు నెలల మధ్యలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, పోలవరం, కర్నూలు, నంద్యాల, మార్కాపురం, అనంతపురం, కడప,నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి తదితర జిల్లాల్లో సాధారణంకంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది… శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కృష్ణ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
