- Advertisement -

పవన్‌పై సుగాలి ప్రీతి పేరెంట్స్‌ సంచలన ఆరోపణలు

- Advertisement -

కర్నూలు జిల్లాకు చెందిన సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. తమ కుమార్తెకు న్యాయం చేయాలంటూ గత తొమ్మిదేళ్లుగా పోరాడుతున్న బాధిత తల్లిదండ్రులు ఇవాళ మాజీ సీఎం జగన్ ను కలిసి తమకు న్యాయం జరిగేలా పోరాడాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సుగాలి పార్వతి, రాజు నాయక్ ..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో తమకు మద్దతుగా నిలిచిన జనసేన అధినేత అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉంటానని నమ్మించి ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి దక్కాక కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ విషయంలో తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు పవన్ కళ్యాణ్ తన అనుచరులు వీరమహిళలు మంత్రులతో కలిసి తమపై మూకుమ్మడి దాడి చేయించారంటూ బాధితులు సంచలన ఆరోపణలు చేశారు.

గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కర్నూలు పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రీతి ఉదంతాన్ని స్వయంగా ప్రస్తావించి తానున్నానంటూ భరోసా ఇచ్చారని వారు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన మాటలను నమ్మి తాము ఎన్నికల్లో జనసేనకు మద్దతుగా నిలిచామన్నారు. తీరా ఇప్పుడు అధికార పీఠం దక్కిన తర్వాత సుగాలి ప్రీతి కేసు ఫైలును పూర్తిగా పక్కన పెట్టేశారని విమర్శించారు. ఒక గిరిజన కుటుంబం పట్ల ఇంత నిర్దయాత్మకంగా వ్యవహరించడం పాలకులకు తగదన్నారు. న్యాయం కోసం ఉప ముఖ్యమంత్రిని నిలదీస్తే తమ గొంతు నొక్కేందుకు రౌడీ మూకలను ఉసిగొల్పుతున్నారని వాపోయారు.

ఈ కేసు దర్యాప్తుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేసేందుకు తెరవెనుక పెద్ద ఎత్తున కుట్రలు సాగుతున్నాయని ప్రీతి తల్లిదండ్రులు ఆరోపించారు. గతంలో సీబీఐ విచారణ కోరిన నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దర్యాప్తు సంస్థలను ఎందుకు ప్రభావితం చేస్తున్నారని ప్రశ్నించారు. నిరసనల వేళ తమ అంగవైకల్యాన్ని సామాజిక వర్గాన్ని ఎత్తిచూపుతూ కులం పేరుతో నీచంగా దూషిస్తూ అవమానాలకు గురిచేస్తున్నారని పార్వతి రాజు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోయినా సరే నిందితులకు శిక్ష పడేవరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -