తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి విడదల రజిని. వైసీపీని ఉద్దేశించి టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదని ఆమె స్పష్టం చేశారు.
చంద్రబాబు నాయుడు తన మంత్రులతో వైసీపీపై ఇష్టానుసారంగా మాట్లాడిస్తున్నారని రజిని మండిపడ్డారు. ముఖ్యంగా వైసీపీని ‘గొడ్డలి పార్టీ’ అని పిలవడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో హుందాతనాన్ని విస్మరించి, మంత్రులతో అసభ్యకరమైన పదజాలం వాడించడం చంద్రబాబుకే చెల్లిందని ఆమె విమర్శించారు.
చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్ర అంతా వెన్నుపోట్లతోనే నిండి ఉందని రజిని ఆరోపించారు.రాజకీయాల్లో వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే. సొంత మామకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీది. అలాంటి మీరు క్రమశిక్షణతో కూడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా?” అని ఆమె ప్రశ్నించారు.
సొంత ప్రయోజనాల కోసం ఎవరినైనా వెన్నుపోటు పొడిచే వ్యక్తిత్వం చంద్రబాబుదని ఆరోపించారు.మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే చంద్రబాబు ఎందుకు వారించడం లేదని నిలదీశారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని, తమ పార్టీపై చేసే అసత్య ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పక్కన పెట్టి, కేవలం వైసీపీని లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేస్తోందని విడదల రజిని విమర్శించారు. తప్పుడు మాటలు మాట్లాడటం మానుకుని, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆమె హితవు పలికారు.
