అవినీతి కేసుల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయి నెలరోజులగా రిమాండ్‌లో ఉన్నారు చంద్రబాబు. ఇక చంద్రబాబును జైలు నుండి బయటకు తీసుకొచ్చేందుకు ఆయన తరపు లాయర్లు చేస్తున్న ప్రయత్నాలు ఏవి ఫలించడం లేదు. పెద్ద పెద్ద లాయర్లు రంగంలోకి దిగినా బాబుకు నిరాశే ఎదురవుతోంది. ఇక ఏపీ హైకోర్టుతో పాటు సీఐడీ న్యాయస్థానంలో ఇప్పటికే పలుమార్లు బాబు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురికాగా సుప్రీం పైనే ఆశలు పెట్టుకున్నారు చంద్రబాబు.
బాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై వాడివేడిగా వాదనలు జరుగుతున్నాయి. జస్టిస్ అనిరుద్దబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టగా చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్‌సాల్వే, అభిషేక్ మను సింఘ్వీ, సిద్ధార్థ లూథ్రా.. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ, రంజిత్‌కుమార్ వాదనలు వినిపించారు. ఇక ప్రధానంగా ఇరువర్గాల మధ్య హోరాహోరిగా వాదనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఓవైపు బాబు బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాదులు చెమటోడ్చుతుండగా మరోవైపు ఆయన ఎప్పుడు విడుదల అవుతారు? అసలు బెయిల్ వస్తుందా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఎందుకంటే సామాన్య ప్రజలకు కూడా అర్ధం అయ్యేలా టీడీపీ హయాంలో జరిగిన అవినీతి ప్రజల కళ్ల ముందే కనబడుతోంది. ఏపీలో ఎవరిని కదిలించి చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడితే సామాన్య ప్రజలే అసలు స్కాం ఎలా జరిగిందో చెప్పే పరిస్థితి కనిపిస్తోంది. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. అప్పటి అధికారుల్ని ప్రభావితం చేస్తూ ఎలాంటి విధివిధానాలను పాటించకుండా చంద్రబాబు స్వయంగా సంతకాలు చేయడమే బిగ్గెస్ట్ మిస్టేక్ అని పలువురు చెబుతున్నారు. అందుకే ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్ట్ అవడం ఖాయమని ప్రజలే మాట్లాడుతున్న పరిస్థితి. ఏదిఏమైనా మరికొద్ది నెలల పాటు చంద్రబాబు జైల్లోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని అంతా చెబుతున్న పరిస్థితి. ఇక సుప్రీం సైతం ఆర్ధిక నేరాలకు సంబంధించి ఇప్పటికే పలు కేసుల్లో కీలక తీర్పులను వెలువరించడం, ప్రధానంగా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించే పరిస్థితి. అందుకే మరిన్ని నెలలు బాబు జైల్లో ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
