బాలీవుడ్ విలక్షణ నటుడు అక్షయ్ ఖన్నా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘మహాకాళి’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఆయన ప్రశాంత్ వర్మ నిర్మిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ ‘అధీర’లో కూడా ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.
కళ్యాణ్ దాసరి హీరోగా, శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ‘అధీర’ చిత్రంలో అక్షయ్ ఖన్నా ఒక ప్రాముఖ్యత కలిగిన పాత్ర కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోండగా దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రశాంత్ వర్మ ఇటీవల ‘మహాకాళి’ చిత్రం నుండి అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన ‘అసురగురువు శుక్రాచార్యుడి’ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అక్షయ్ ఖన్నాతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని ప్రశాంత్ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. నిశ్శబ్దంగా ఉంటూనే అద్భుతమైన నటనను ప్రదర్శించే నిజమైన నటుడు అక్షయ్ అని ఆయన కొనియాడారు.
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ధురంధర్’ చిత్రంలో ‘రెహ్మాన్ డకైత్’గా అక్షయ్ ఖన్నా అద్భుతమైన నటనను కనబరిచారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిశాయి. దీనితో పాటు, సన్నీ డియోల్‌తో కలిసి ‘ఇక్కా’ అనే క్రైమ్ డ్రామాలో కూడా ఆయన నటిస్తున్నారు. ‘బోర్డర్’ సినిమా తర్వాత దాదాపు 30 ఏళ్లకు వీరిద్దరూ కలిసి నటిస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
