జాతీయ అవార్డు విజేత నటి నిత్యా మీనన్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఒకప్పుడు హీరోయిన్‌గా నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు నిర్మాతగా మారారు. ‘కేయూరి ప్రొడక్షన్స్’ పేరుతో స్వంత నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు ప్రకటించారు.
ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో ప్రత్యేక వీడియో ద్వారా వెల్లడించారు. స్క్రిప్ట్‌కు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలు, లోతైన పాత్రలు, ప్రభావవంతమైన కథనాలను ప్రోత్సహించడమే ఈ బ్యానర్ లక్ష్యమని తెలిపారు. తనకు సినిమాలు అంటే భావోద్వేగ అనుబంధం, మార్పు కలిగించే శక్తి అని, అదే విలువలను ప్రతిబింబించే ప్రాజెక్టులకు ఈ నిర్మాణ సంస్థ వేదిక అవుతుందని చెప్పారు.
నిత్యా మీనన్ ఎప్పుడూ నటనకు ప్రాధాన్యం ఉన్న, భిన్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్న నేపథ్యంలో, ఆమె నిర్మాతగా మారడం సహజమైన ముందడుగుగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ‘కేయూరి ప్రొడక్షన్స్’ బ్యానర్ కింద ఏ సినిమా ప్రకటించలేదు.
