సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ఈసీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మార్చి 21న హోలీ, 24న ఆదివారం సెలవు దినాలు కావడంతో ఆ రెండురోజులూ నామినేషన్ల స్వీకరించోమని అధికారులు వెల్లడించారు.
ఏపీలోకూడా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువరించామని చెప్పిన ద్వివేది, వెంటనే జిల్లావారీగా నోటిఫికేషన్ లు జారీ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచీ మధ్యాహ్నం 3 గంటలవరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణకు మొత్తం 45,920 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేస్తోంది ఈసీ. 3 లక్షల మంది సిబ్బందిని వాడుతోంది. భద్రత కోసం 350 ప్లటూన్ల CRPFను దింపుతోంది.
ఈ నెల 25 వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 28 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. పోలింగ్ ఏప్రిల్ 11న జరుగుతుంది. ఇప్పటికే వైసీపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా, మిగతా పార్టీలు వెనుకంజలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ 35 అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులను ఇంకా నిర్ణయించలేదు. కాంగ్రెస్ అయితే ఇప్పటి వరకు ఒక్క అభ్యర్ధిని ప్రకటించలేదు.
