ఆక్వా రైతులు, ప్రాన్ ఫెడరేషన్ ప్రతినిధులతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆక్వా రైతు ప్రతినిధులతో భేటీ కాగా ఈ సందర్భంగా తమ సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు ఆక్వా రైతులు. భారీగా పడిపోయిన రొయ్యల ధరలు, అమాంతం పెరిగిన ఫీడ్ ధరలు , కరెంటు బిల్లుల సబ్సిడీ ఎగవేత, ఎగుమతుల సమస్యలతో సహా అనేక ఇబ్బందులు పడుతున్నామని జగన్‌కు వివరించారు ఆక్వా రైతులు.
ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ ఆక్వాఫీడ్ ధరలను తక్షణమే తగ్గించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆక్వా రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. పెరిగిన ఆక్వాఫీడ్ ధరల కారణంగా పెట్టుబడి వ్యయం పెరిగి రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారని జగన్ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పెంచిన ఆక్వాఫీడ్ ధరలను ఈ నెలాఖరులోగా ఖచ్చితంగా తగ్గించాలని డెడ్‌లైన్ విధించారు.
ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే నెల నుంచి రైతులతో కలిసి వైసీపీ తరఫున పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఆక్వా రైతులకు వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి హక్కుల కోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని జగన్ భరోసానిచ్చారు.
గతంలో వైసీపీ హయాంలో ఆక్వా రంగాన్ని ఆదుకోవడానికి, రైతులకు మేలు చేయడానికి ఎన్నో సంస్కరణలు తెచ్చాం అని గుర్తు చేశారు జగన్. కానీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏపీలో ఆక్వా రైతులు నేడు అత్యంత దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
