జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో జాతీయ రహదారి-44పై ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంటలో పడిపోయింది. బస్సు బోల్తా పడటంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
ఈ ప్రమాదంలో సుమారు 20 మందికిపైగా ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. బస్సు వేగంగా బోల్తా పడటంతో పలువురి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. మరికొందరికి తలలకు తీవ్ర గాయాలు అయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంఘటనాస్థలిలో విషాదకర దృశ్యాలు కనిపించాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని బయటకు తీసి అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రులకు తరలించారు.
క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిర్లక్ష్యం లేదా సాంకేతిక లోపం కారణమా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
