ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరి పేటలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. బ్యాంక్ ఆఫ్ బరోడా సమీపంలో ఉన్న బిర్యాని హోటల్‌లోకి ఓ కారు అదుపు తప్పి దూసుకెళ్లిన ఘటన జరిగింది.
చిలకలూరిపేటలోని బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు హోటల్ ముందు ఉన్న పెద్ద కటౌట్‌ను బలంగా ఢీకొట్టి ఆగింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎక్కువ మంది లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
కారులో ఉన్న యువతి, యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.ప్రమాదం తర్వాత అక్కడికి చేరుకున్న స్థానికులు వారిని నిలదీయగా, కారులో ఉన్న యువత వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని కారులో ఉన్న యువతి, యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టుతున్నారు. మద్యం సేవించి వాహనం నడపడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. మొత్తానికి, సమయానికి పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
