హైదరాబాద్ నుంచి ఏపీ సచివాలయాన్ని గుంటూరు జిల్లాలోని వెలగపూడిలో తాత్కాలికంగా నిర్మించిన సచివాలయంలోకి తరలించిన విషయం తెలసిందే. మన రాజధాని – మన పాలన పేరుతో ఈ నెల 3 నుంచి ఇక్కడి నుంచే పాలనను ప్రారంభించారు. మంత్రలు సమీక్షలు సహా అధికారిక నిర్ణయాలు అన్నీ ఈ సచివాలయం కేంద్రంగానే సాగుతున్నాయి.
ఈ క్రమంలో సీఎం చంద్రబాబు కూడా తన కార్యాలయాన్ని ఈ నూతన సచివాలయంలోనే ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం ఆయన తన కార్యాలయంలోకి వేదోక్తంగా ప్రవేశించారు. వేద పండితుల సూచనల మేరకు ఏకాదశి – బుధవారం ఉదయం నిర్ణీత శుభ ముహూర్తంలో ఆయన కార్యాలయంలోకి అడుగు పెట్టారు.
పూజలు – ఆశీర్వచనాలు పూర్తయ్యాక కొత్త కార్యాలయంలోకి అడుగు పెట్టిన సందర్భంగా తొలి సంతకం డ్వాక్రా మహిళల రుణాల మాఫీకి సంబంధించిన ఫైలుపై చేశారు. వాస్తవానికి డ్వాక్రా మహిళల రుణ మాఫీకి సంబంధించిన తొలి ఫైలుపై చంద్రబాబు ఎప్పుడో సంతకం చేశారు. ఇక ఇది రెండో ఫైలు కావడం గమనార్హం. ఈ కార్యక్రమానికి మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప – పీ నారాయణ – కొల్లు రవీంద్ర – ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చంద్రబాబు ఫైలు పై సంతకం చేయగానే అక్కడున్న మంత్రులు సహా ప్రతి ఒక్కరూ చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు.
