టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. తెలంగాణ ఎక్సైజ్ శాఖకు లేఖ రాసింది ఈడీ. కేసుకు సంబంధించి నిందితులు, సాక్షుల వాగ్మూలాలు, కాల్ డేటా, డిజిటల్ రికార్డులు కావాలని కోరింది. ఇటీవలే డ్రగ్స్ కేసులో వివరాలు , డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని ఈడీ హైకోర్టులో కంప్లైంట్ చేసింది. దీంతో కేసుకు సంబంధించి రికార్డులన్నీ ఈడీకి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈడీ మరోసారి ఎక్సైజ్ శాఖకు లేఖ రాసింది.

టాలీవుడ్ డ్రగ్స్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గతంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా డిజిటవ్ రికార్డులతో సహా ఈడీ అధికారులు అడిగిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ అధికారులను హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. 2017 జూలైలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురిని ఎక్సైజ్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.30 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో పలువురు సినీప్రముఖుల పేర్లను నిందితులు వెల్లడించడం సంచలనమైంది.

ఇప్పటికే సదరు సినీ ప్రముఖులను సిట్‌ విచారించింది. టాలీవుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో 12 కేసులను నమోదు చేసి, 30 మందిని సిట్‌ అరెస్ట్‌ చేసింది. 11 చార్జీషీట్‌లను కోర్టులో దర్యాప్తు అధికారులు దాఖలు చేశారు. ఈ కేసులో పెద్దమొత్తంలో డ్రగ్స్‌ అమ్మకాలు, కొనుగోలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది. పలువురు సినీ ప్రముఖులు డ్రగ్స్‌ను వినియోగించినట్లు సిట్‌ గుర్తించింది. సినీ ప్రముఖుల ప్రమేయం ఉండటంతో పెద్ద మొత్తంలో మనీలాండరింగ్‌ జరిగి ఉంటుందని ఈడీ భావించింది. ఇప్పటికే వారి నుంచి వివరాలను సేకరించింది.

Related Articles

Most Populer

Recent Posts