రైతులకు శుభవార్త. ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే వరి, పత్తి, కంది, పెసర, మినుము వంటి పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచింది. కనీస మద్దతు ధర పెంచాలంటూ వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ చేసిన సూచనలను ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఉన్న ఆర్దిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది.
కనీస మద్దతు ధర పెంపుతో పాటు కంది, మినప, పెసర వంటి పంటలపై క్వింటాలుకు 225 రూపాయల బోనస్ ను కూడా ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం ఈ మూడు పంటలకు 425 రూపాయల బోనస్ లభిస్తోంది. వరి పంటకు క్వింటాలుకు 60 రూపాయల కనీస మద్దతు ధర నిర్ణయించింది. దీంతో వరి క్వింటాలు 1510 రూపాయలకు చేరుకుంది.
పత్తికి కూడా 60 రూపాయలు మద్దతు ధర పెంచడంతో దీని ధర కూడా క్వింటాలుకు 3860 రూపాయలైంది. వీటితో పాటు ఈ సంవత్సరం నూనె గింజలకు కూడా బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈనూతన ధరలు అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి.
