తమిళనాడులో గుట్కా స్కాం ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సీబీఐ అధికారులు చెన్నైలో దాడులు చేశారు. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సి విజయ భాస్కర్, డీజీపీ టీకే రాజేంద్రన్‌తో పాటు 0 చోట్ల ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఉదయం 7 గంటలకు ఒక్కసారిగా సీనియర్ అధికారులు, అధికార అన్నాడీఎంకే నేతల ఇళ్లను చుట్టుముట్టిన సీబీఐ, పోలీస్ అధికారులు వారి ఫోన్లను స్వాధీనం చేసుకుని దాడులను ముమ్మరం చేశారు.నిషేధిత గుట్కా వ్యాపారం చేసుకునేందుకు ఆరోగ్యశాఖ మంత్రి, నాటి పోలీసు కమిషనర్, ప్రస్తుత డీజీపీకి కోట్ల రూపాయాల్లో ముడుపులు అందాయన్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ విచారణ జరుపుతోంది.
గుట్కా తయారీదారుల ఇళ్లపై ఐటీ శాఖ 2016లో నిర్వహించిన దాడుల ద్వారా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిషేధిత గుట్కా అమ్మకానికి వాటి తయారీదారులు మంత్రి విజయ భాస్కర్ తో పాటు డీజీపీ రాజేంద్రన్, మాజీ కమిషనర్ జార్జ్, మరికొంత మంది అధికారులకు రూ.39.91 కోట్లు లంచాల రూపంలో చెల్లించినట్లు తేలింది.
గుట్కా స్కామ్‌పై సీబీఐ విచారణ కోరుతూ డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ హైకోర్టులో పిల్ వేశారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆధారాల సేకరణ కోసం సీబీఐ దాడులు నిర్వహించింది.
