తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం నాణ్యత మరియు ఇతర వివాదాస్పద అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ హై లెవెల్ కమిటీలో రాష్ట్రంలోని ముగ్గురు అత్యున్నత స్థాయి అధికారులకు చోటు కల్పించారు. చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS),సభ్యులుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP), రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి ఉన్నారు.
ఇప్పటికే లడ్డు వ్యవహారంపై విచారణ జరిపిన వన్ మెన్ కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను ఈ హై లెవెల్ కమిటీ నిశితంగా పరిశీలించనుంది. అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కోర్టు పరిధిలో ఈ అంశం ఎలా నిలుస్తుంది? అనే విషయాలపై లా సెక్రటరీ సూచనలు చేయనున్నారు.
డీజీపీ ఈ వ్యవహారంలో ఉన్న క్రిమినల్ కోణాలను మరియు విచారణాధికారుల అవసరాన్ని పర్యవేక్షిస్తారు.
ఈ కమిటీ వన్ మెన్ కమిటీ రిపోర్టును అధ్యయనం చేసి, అందులోని లోటుపాట్లు మరియు తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై వారం రోజుల్లోగా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
