అధికారంలోకి వచ్చిన సమయం నుంచి జగన్ విద్యా వ్యవస్థ పైన ప్రత్యేకంగా చర్యలు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను గ్లోబల్ విద్యార్థులుగా తీర్చిదిద్దే ప్రక్రియను చేపట్టారు. గవర్నరమెంట్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన సహా అనేక సంస్కరణలు తెచ్చిన ముఖ్యమంత్రి ‘ఇంటర్నేషనల్ బాకలారియెట్’ (ఐబీ) సిలబస్‌ను కూడా పేద పిల్లలకు చేరువ చేస్తున్నారు. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) అధికారులతో ఐబీ ప్రతినిధులు ఒప్పందం చేసుకోనున్నారు. ఐబీ విద్య ప్రపంచంలోనే అత్యుత్తమ బోధన పద్ధతిగా గుర్తింపు పొందింది. బట్టీ చదువులకు స్వస్తి చెబుతూ థియరీతో పాటు ప్రాక్టికల్ అప్లికేషన్ పద్ధతిలో బోధన సాగుతుంది. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది.
2024 – 25 విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. ప్రస్తుత, భావితరాల అవసరాలకు అనుగుణంగా సిలబస్, బోధన, మూల్యాంకనం ఉంటుంది. చదువుతోపాటు ప్రాక్టికల్స్, విద్యార్థుల్లో నైపుణ్యాల (స్కిల్స్)కు ప్రాధాన్యతనిస్తారు. వారిలో బోధన సామర్థ్యం, నైపుణ్యం పెంచేలా ఈ శిక్షణ ఉంటుంది. టీచర్లతో పాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్ సిబ్బంది, ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ బోర్డు సిబ్బందికి ‘ఐబీ’పై అవగాహన, సామర్థ్యం పెంచేలా శిక్షణనిస్తారు. దీంతో వారంతా ప్రతిష్టాత్మక ఐబీ గ్లోబల్ టీచర్ నెట్‌వర్క్‌లో భాగమవుతారు. 2025 జూన్ నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్ బోధన ప్రారంభమవుతుంది. ఏటా ఒక్కో తరగతికి ఈ సిలబస్‌ను పెంచుతూ 2035 నాటికి 10వ తరగతి, 2037కి 12వ తరగతిలో అమలు చేస్తారు. పరీక్షల అనంతరం ఐబీ బోర్డు, ఏపీఎస్సీఈఆర్టీ ఉమ్మడిగా సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తాయి. ఈ సర్టిఫికెట్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు సైతం ఉంటుంది.
సంగీతం, నృత్యం, క్రీడలు వంటి ఇతర అంశాల్లోనూ తర్ఫీదు ఇస్తారు. ఇంటర్ డిసిప్టీనరీ కాన్సెప్ట్ (వాస్తవిక జీవిత అంశాలు) ఆధారంగా బోధన సాగుతుంది. ఈ సిలబస్‌ను అభ్యసించిన విద్యార్థులు ఇతరులతో పోలిస్తే ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో మూడు రెట్లు అధికంగా ప్రవేశాలు పొందుతున్నారు. ప్రపంచస్థాయి ఉద్యోగావకాశాలను సైతం వేగంగా అందుకుంటున్నారు. హై స్కూల్ స్థాయిలో ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం 62 వేల ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలు, ఇంగ్లిష్ ల్యాబ్స్ ఏర్పాటు చేసింది. ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లిష్‌లో నైపుణ్యం సాధించేందుకు మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణనిస్తోంది. ఐబీ సిలబస్‌ను సులభంగా అర్థం చేసుకునేందుకు, అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేందుకు ఈ మార్పులు దోహదం చేస్తాయి.
