కాకినాడ జిల్లా తుని పరిధిలో అదృశ్యమైన రెండేళ్ల పసిపాప సుంకర జ్ఞానేశ్వరి మిస్సింగ్ ఘటన ఇప్పుడు అందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.అడవులు, కొండలు, చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ అధికారులు రాత్రింబగళ్లు జల్లెడ పడుతున్నా చిన్నారి జాడ దొరకలేదు.
వివరాల్లోకి వెళ్తే.. తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని చిక్కుళ్ల అగ్రహారానికి చెందిన ఈ చిన్నారి, ఈ నెల 6వ తేదీన తన పెంపుడు కుక్కతో కలిసి ఇంటి బయట ఆడుకుంటూ అకస్మాత్తుగా అదృశ్యమైంది. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు సాగిస్తుండగా.. పాపతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క మూడు రోజుల తర్వాత ఒంటరిగా గ్రామానికి తిరిగి రావడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. అయితే ఇంటి వద్ద జనాల హడావుడి చూసి భయపడిన ఆ కుక్క.. కొందరిపై దాడి చేసి మళ్లీ పారిపోయింది. చివరికి డాగ్ క్యాచర్ల సహాయంతో దాన్ని పట్టుకున్న పోలీసులు.. దానికి వెటర్నరీ వైద్యులతో చికిత్స చేయించి కోలుకునేలా చేశారు.
ఈ కేసును ఛేదించడానికి పెద్దాపురం డీఎస్పీ తిలక్ పర్యవేక్షణలో అటవీ శాఖ, ఎస్డీఆర్ఎఫ్, క్యూఆర్టీ బృందాలు సరికొత్త టెక్నాలజీని రంగంలోకి దించాయి. హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా తెప్పించిన హైటెక్ జీపీఎస్ (GPS) ట్రాకర్‌ను ఆ పెంపుడు కుక్కకు అమర్చి అడవిలోకి వదిలారు. ఆ ట్రాకర్ ఆధారంగా కుక్క సంచరించిన సుమారు 8 కిలోమీటర్ల మేర ప్రతి అంగుళాన్ని అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే పాప కాళ్లకు ఉన్న వెండి పట్టీల ఆధారంగా అయినా ఆచూకీ కనిపెట్టవచ్చనే ఆశతో.. దట్టమైన అడవిలో ‘సిల్వర్ మెటల్ డిటెక్టర్లను’ కూడా వాడుతున్నారు. ఇంత సాంకేతికతను ఉపయోగించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి క్లూ లభించకపోవడం గమనార్హం. ఆ పసిపాప సురక్షితంగా దొరికే వరకు ఈ మెగా సెర్చ్ ఆపరేషన్ ఆపే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టం చేశారు.
