డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు కావేరీ ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించారు. ప్రస్తుతం కరుణానిధి ఆరోగ్యం స్థిరంగా ఉందనీ, ఆయన కోలుకుంటున్నారని బులెటిన్ లో వైద్యులు తెలిపారు.
శుక్రవారం అర్ధరాత్రి దాటక ఒక్కసారిగా బీపీ పడిపోవడంతో ఆయన్ను కుటుంబసభ్యులు హుటాహుటిన కావేరీ ఆస్పత్రికి తరలించారు. వదంతులు నమ్మొద్దని, ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందంటూ తనయుడు స్టాలిన్ ప్రకటన చేసిన కొద్దిగంటలకే ఈ పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం.
గత కొంతకాలంగా వయసురీత్యా సమస్యలతో కరుణానిధి(94) బాధపడుతున్నారు. గొంతులో అమర్చిన ట్రాకియాస్టమీ ట్యూబ్ మార్పిడి కారణంగా కరుణకు స్వల్పంగా జ్వరం, ఆపై ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో గోపాలపురంలోని ఆయన ఇంటిలోనే శుక్రవారం వైద్యులు చికిత్స అందించారు.
పరిస్థితి మెరుగవుతున్న క్రమంలో ఒక్కసారిగా బీపీ పడిపోవటంతో పరిస్థితి విషమించింది. దీంతో అర్ధరాత్రి హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఐసీయూకి తరలించి వెంటిలేటర్ల సాయంతో ఆయనకు చికిత్స అందించారు. అయితే కాసేపటికే కరుణానిధి పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు డీఎంకే నేత డీ రాజా వెల్లడించారు.
