గత రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలిందని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. ఈ రెండేళ్లలో మొత్తం 576 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారని ఆయన తెలిపారు. లొంగిపోయినవారు 144 హైక్వాలిటీ ఆయుధాలను స్వచ్ఛందంగా అప్పగించారని చెప్పారు. ఇందులో నాలుగు సెంట్రల్ కమిటీ సభ్యులు, ఐదుగురు స్టేట్ కమిటీ సభ్యులు సహా పలువురు కీలక స్థాయి నేతలు ఉన్నట్లు డీజీపీ వివరించారు.
తాజాగా డీజీపీ సమక్షంలో మావోయిస్టు పార్టీ కీలక నేత బర్సే దేవాతో పాటు మరో 20 మంది కీలక మావోయిస్టులు పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. వీరి నుంచి భారీగా ఆయుధాలు, గోలీలు, అలాగే రూ.20 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సరెండర్ ఘటనలు మావోయిస్టు సంస్థలోని బలహీనతను స్పష్టంగా చూపిస్తున్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మిగిలిన మావోయిస్టులకు కీలక సందేశం ఇచ్చారు. “సమయం మించిపోతోంది. మీకు నాయకత్వం వహించిన వారే ఇప్పటికే లొంగిపోయారు. ఇక మీరు అడవుల్లో ఉండి లాభం లేదు. బయటకు వచ్చి సాధారణ జీవితాన్ని ప్రారంభించండి” అని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం సరెండర్ పాలసీ కింద పునరావాసం, ఆర్థిక సహాయం, భద్రత కల్పిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. శాంతి మార్గాన్ని ఎంచుకుంటే భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని డీజీపీ స్పష్టం చేశారు.
