Sunday, May 12, 2024
- Advertisement -

ఓ వైపు శాంతి మంత్రం.. మ‌రోవైపు కాల్పులు.. పాక్ ప్లాన్ ఏంటీ?

- Advertisement -

ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ క‌మాండ‌ర్ విక్ర‌మ్ అభినంద‌న్ వ‌ర్థ‌మాన్‌ను తిరిగి భార‌త్‌కు అప్ప‌గించ‌డాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌చారం చేసుకుంటుంది దాయాది దేశం. అంతేకాదు అభినంద‌న్‌ను అప్ప‌గించే వ‌ర‌కు ఇమ్రాన్‌ఖాన్ ఈ విష‌యాన్ని ప‌రిశీలిస్తూ బీజీగా ఉన్నార‌ట‌. ఈ వార్త‌ను పాక్ మీడియా ప్ర‌చారం చేసిందో లేదో తెలియ‌దు కానీ.. ఇండియ‌న్ మీడియాలో మాత్రం ప్రముఖంగా క‌నిపించింది. తాము శాంతి కాముకుల‌మ‌ని.. కానీ ప్ర‌ధాని మోదీనే ఎన్నిక‌లు ఉన్నాయి కాబ‌ట్టి.. త‌మ‌పై స‌మ‌రానికి సై అంటున్నారని ప్ర‌చారం చేస్తున్నారు. ఇండియాలోని కొన్ని పార్టీల అధినేత‌లు కూడా ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని కూడా ప్ర‌ధానంగా చూపిస్తోంది పాక్‌ మీడియా.

శాంతిని కోరుకుంటున్నామంటునే స‌రిహ‌ద్దుల్లో క‌వ్వింపు చ‌ర్య‌లు ఎందుకు అన్న ప్ర‌శ్న‌కు దాయాది దేశం వ‌ద్ద స‌మాధానం లేదు. నిజంగా చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మైతే పాక్ ఆర్మీ తుపాకులు ఎందుకు గ‌ర్జిస్తున్నాయి? సైనికులు, స‌రిహ‌ద్దు గ్రామాల ప్ర‌జ‌ల‌ ప్రాణాల‌ను ఎందుకు బ‌లి తీసుకుంటుంది పాక్ ఆర్మీ. ఓ ప‌క్క పాక్ రెంజ‌ర్లు కాల్పులు జ‌రుపుతుంటే.. క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు ఆర్మీ స్థావ‌రాలే టార్గెట్‌గా మందుపాత‌రల‌ను పేల్చాల‌ని చూస్తున్నారు. ఏ ఉగ్ర‌వాది గురించి ఆరా తీసినా.. అది పాకిస్తాన్ చిరునామాలనే చూపిస్తున్నాయి. మ‌రి ఇమ్రాన్‌ఖాన్ శాంతి మంత్రం నిజ‌మే అని ఎలా నమ్మాలి?

ఈ ప‌రిస్థితికి రెండే కార‌ణాలు అయ్యుండాలి.. ఇమ్రాన్ నిజంగానే చ‌ర్చ‌లు కోరుకుంటున్నారు.. కానీ ఆయ‌న ఇచ్చిన ఆదేశాల‌ను పాక్ ఆర్మీ ప‌ట్టించుకోకుండా ఉండాలి.. లేదా ఇమ్రాన్ ప్ర‌పంచ‌దేశాల ప్రాప‌కం కోసం పైకి న‌టిస్తూ.. భార‌త్‌ను ఢీకొనే స‌త్తా లేక ఇలాంటి దిగ‌జారుడు ప‌నులైనా చేస్తూ ఉండాలి.

కార‌ణ‌మేదైనా భార‌త్‌ను ఇరుకున పెడుతూ.. రెచ్చ‌గొట్ట‌డానికే ఇలాంటి చ‌ర్య‌ల‌కు దిగుతున్నార‌న్నేది విశ్లేష‌కుల మాట‌. ఓ వైపు స‌రిహ‌ద్దుల్లో క‌వ్విస్తూ.. క‌శ్మీర్‌లోకి ఉగ్ర‌వాదుల‌ను ఎగ‌దోస్తుంది పాకిస్తాన్‌. కేంద్రానికి ఏదైనా చిర్రెత్తుకొచ్చి ఏ చ‌ర్య‌కైనా దిగితే… తాము శాంతికి ప్ర‌య‌త్నిస్తూంటే.. ఇండియానే క‌య్యానికి కాలుదువ్వుతుందని ప్ర‌చారం చేయాల‌ని దాయాది దేశం ఆలోచ‌న కావ‌చ్చు.

ఏదీ ఏమైనా ఈ పోరాటంలో ఎంద‌రో సైనికులు అమ‌ర‌ల‌వుతున్నారు. తాము కూడా దిన‌దిన‌గండంగా బ‌త‌క‌లేమ‌ని.. ఓ శాశ్వ‌త ప‌రిష్కారం కావాలంటున్నారు స‌రిహ‌ద్దు గ్రామాల ప్ర‌జ‌లు. దాని కోసం కొంత న‌ష్టం భ‌రించ‌డానికైన సిద్ధ‌మంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -