కర్నూలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం తీవ్ర రసాభసతో కొనసాగింది. మున్సిపల్ కమిషనర్ సమావేశానికి హాజరు కాకపోవడంతో వైసీపీ కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తూ, తమ సమస్యలు, ప్రజల ఫిర్యాదులు ఎవరికి చెప్పుకోవాలని మండిపడ్డారు. నగరాభివృద్ధి, మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీటి సమస్యలపై చర్చించేందుకు వచ్చిన సమావేశం రాజకీయ ఆరోపణలతో ఉద్రిక్తంగా మారింది.
కమిషనర్ గైర్హాజరు కావడం ప్రజాప్రతినిధుల్ని అవమానించినట్లేనని వైసీపీ సభ్యులు ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని వారు వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో సమావేశాన్ని కొనసాగించడం సాధ్యం కాదని భావించిన మేయర్ చివరికి మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేశారు.
ఇదే సమయంలో టీడీపీ కార్పొరేటర్లు ఎదురుదాడికి దిగారు. వైసీపీ నగర అభివృద్ధిని చూడలేకే కావాలనే రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సమావేశాన్ని అడ్డుకుంటున్నారని టీడీపీ సభ్యులు అన్నారు.
మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రజా సమస్యల పరిష్కారం కంటే రాజకీయ విభేదాలే ఎక్కువగా కనిపిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
