ప్రస్తుత యుద్ధ పరిస్థితుల ప్రభావం దేశంలోని పలు రంగాలపై పడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయంతో హోటల్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సిలిండర్ల కొరత కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు కార్యకలాపాలు కొనసాగించడం కష్టంగా మారింది.
ప్రసిద్ధ బావర్చి రెస్టారెంట్ కూడా ఈ సమస్యను ఎదుర్కొంటోంది. గ్యాస్ సిలిండర్లు సరిపడా అందుబాటులో లేకపోవడంతో అక్కడ డైన్-ఇన్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం కేవలం టేక్ అవే సేవలు మాత్రమే కొనసాగిస్తున్నట్లు సమాచారం. గ్యాస్ కొరత కారణంగా వంట ప్రక్రియలు సక్రమంగా నిర్వహించడం కష్టంగా మారిందని హోటల్ యాజమాన్యం తెలిపింది.
ఇక సిలిండర్ల కొరతతో పాటు మార్కెట్‌లో బ్లాక్ మార్కెట్ కూడా పెరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారని హోటల్ యజమానులు అంటున్నారు. దీనివల్ల చిన్న హోటళ్లు, ఫుడ్ సెంటర్లు మరింత ఇబ్బందులు పడుతున్నాయి.
గ్యాస్ సమస్యతో పాటు కిరాణా సరుకులు, కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయి. వంట నూనె, పప్పులు, కూరగాయలు వంటి వస్తువుల ధరలు పెరగడంతో హోటల్ వ్యాపారులు ఫుడ్ ఐటెమ్స్ ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిస్థితులు కొనసాగితే హోటల్ పరిశ్రమపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గ్యాస్ సరఫరా సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
