Monday, May 6, 2024
- Advertisement -

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి అరెస్ట్‌…ప‌క్కా ఆధారాలున్నాయ్ డీసీపీ సుమ‌తి

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్యా పిల్లల పేరుతో ఇతరులను అమెరికాకు తీసుకెళ్లి వారిని అక్కడే వదిలి వచ్చారనే మాన‌వ అక్ర‌మ ర‌వాణాల‌పై ఆరోపణలపై జగ్గారెడ్డిని పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. నిన్న రాత్రి పటాన్ చెరులో ఓ కార్యక్రమంలో ఉండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు ఆయనను సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరచనున్నారు.

నకిలీ పత్రాలు, పాస్‌పోర్ట్‌తో మానవ అక్రమ రవాణా చేసిన కేసులో జగ్గారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు… ఎనిమిది సెక్షన్ల కింద కేసులు పెట్టారు.పద్నాలుగేళ్ల క్రితం తాను, తన భార్య, ఇద్దరు పిల్లలు అమెరికాకు వెళ్తున్నామంటూ జగ్గారెడ్డి నలుగురికి పాస్‌పోర్టులు తీసుకున్నారని, ఆ పర్యటన అనంతరం ఆయన ఒక్కరే తిరిగి వచ్చారంటూ ఒక వ్యక్తి సికింద్రాబాద్‌లోని మార్కెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు.. జగ్గారెడ్డి అమెరికాకు వెళ్లినప్పుడు తన భార్య, పిల్లలతో కాకుండా గుజరాత్‌కు చెందిన యువతి, ఆమె ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి అక్కడే వదిలేశారని గుర్తించారు. మానవ అక్రమ రవాణా చట్టరీత్యా నేరమైనందున కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

గుజరాత్ కు చెందిన ముగ్గురిని తన కుటుంబసభ్యులుగా పేర్కొంటూ 2004లో వారిని అమెరికాకు తరలించారంటూ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ ముగ్గురి వద్ద నుంచి రూ. 15 లక్షలు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఆయనపై ఐపీసీ సెక్షన్లు 419, 490, 467, 468, 471, 370, పాస్ పోర్టు యాక్ట్ సెక్షన్ 12, ఇమిగ్రేషన్ యాక్ట్ సెక్షన్ 24 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

మనుషుల అక్రమ రవాణా కేసులో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పక్కా ఆధారాలతోనే అరెస్ట్‌ చేసినట్లు డీసీపీ సుమతి తెలిపారు. ఆయన ముగ్గుర్ని కుటుంబ సభ్యుల పేరుతో అక్రమంగా అమెరికాకు పంపారని, దీనికి వారి నుంచి రూ. 15 లక్షలు తీసుకున్నారని తెలిపారు.

తనను అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, హరీష్‌రావు నన్ను జైళ్లో పెట్టించాలనుకున్నారు.. అదే చేస్తున్నారని వారిపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి జైలుకు పంపేందుకు కేసీఆర్, హరీష్ రావు రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

తాను ఎవరిని విదేశాలకు తీసుకెళ్లలేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్, హరీష్ రావుపై కూడా నకిలీ పాస్ పోర్ట్ కేసులున్నాయన్నారు. రాహుల్ గాంధీ సభ తర్వాత తన అరెస్ట్‌కు కుట్ర పన్నారని, సిద్దిపేటలో తమ అభ్యర్థిని గెలిపించేందుకే తనను అరెస్ట్ చేశారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -