- Advertisement -

నందమూరి కుటుంబానికి శాపమా ?

- Advertisement -

సీనియర్ రాజకీయ నాయకుడు, సినీ నటుడు నందమూరి హరికృష్ణ (61) ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడంతో అంతటా విషాదం అలుముకుంది. రాజకీయ, సినీ రంగాలకు చెందిన వారితో పాటు నందమూరి కుటుంబం, అభిమానుల్లోనూ ఈ దుర్వార్త తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున 4 గంటల సమయంలో నెల్లూలు జిల్లా కావలి వెళ్తుండగా హరికృష్ణ కారుకు ప్రమాదం జరిగింది. కావలిలో మోహన్ అనే అభిమాని ఇంటిలో వివాహానికి వెళ్తుండగా నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. హరికృష్ణ కారు ముందు కారును ఓవర్ టేక్ చేయబోయిన సమయంలో రోడ్డు డివైడర్ ను ఢీకొట్టి రోడ్డుకు అవతల వైపు వస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆయన ఎగిరి రోడ్డు మీద పడిపోయారు. తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లిలో కామినేని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తక్షణం వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. ఆయన ఉదయం 7 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారని డాక్టర్లు వెల్లడించారు.

ఇక ఇదే హైవేలో 2014లో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకిరామ్ ప్రాణాలు కోల్పోయారు. నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో జానకీరామ్ దుర్మరణం చెందారు. అప్పటినుంచి నందమూరి కుటుంబం రోడ్డు ప్రమాదాల పట్ల తరచూ ప్రజలను అప్రమత్తం చేస్తూ వస్తోంది. రోడ్డు ప్రమాదాలతో మీ కుటుంబాల్లో విషాదం నింపవద్దు. మా కుటుంబంలో జరిగిన విషాదం ఇంక ఏ కుటుంబంలోనూ జరగనీయవద్దు…అని తమ సినిమాల్లో వీటిపై ప్రత్యేకించి ఎన్టీఆర్ వాయిస్ తో ప్రకటనలు కూడా ఇచ్చి జనాలను హెచ్చరిస్తూ వస్తోంది. హరికృష్ణ సహా నందమూరి కుటుంబీకులు అందరూ అప్పటి నుంచి కారు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హరికృష్ణకు డ్రైవింగ్ లో సుదీర్ఘ అనుభవం కూడా ఉండటంతో ఆయన వేరే డ్రైవర్ ను పెట్టుకోకుండా, స్వయంగా తానే కారు నడుపుకునేవారు. సీటు బెల్టు పెట్టుకోవడంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ నేటి ప్రమాదంలో ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారు.

2009 ఎన్నికల ప్రచారానికి వెళ్లి హైదరాబాద్ వస్తూ జూనియర్ ఎన్టీఆర్ కారు కూడా రోడ్డు ప్రమాదానికి గురైంది. కొందరు స్నేహితులతో పాటు ఎన్టీఆర్ వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో ఎన్టీఆర్ గాయపడ్డారు. 32 చోట్ల ఆయనకు ఆపరేషన్ జరిగినట్లు నాడు వైద్యులు ప్రకటించారు. అంత ప్రమాదం జరిగినా అదృష్టవశాత్తూ ఎన్టీఆర్ ప్రాణాలు దక్కాయి. అప్పట్లో ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం జరగిన ప్రాంతంలోనే ఐదేళ్ల తర్వాత 2014లో ఆయన అన్నయ్య జానకి రామ్ కారు ప్రమాదం జరిగింది. ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత నాలుగేళ్ల తర్వాత అంటే నేడు 2018లో అదే నల్గొండ నార్కెట్ పల్లి హైవేలోనే హరికృష్ణ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ హైవేలో నందమూరి కుటుంబానికి ప్రాణగండముందా ? లేక శాపమా ? అని అభిమానుల్లో చర్చ జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -