ఇటీవల జగనిన ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీతో అదికారంలోకి రావడంతో వైఎస్ జగన్ ఈనెల 30న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీని కంటె ముందుగా వైఎస్ఆర్ ఎల్పీ నేతగా ఎమ్మెల్యేలు జగన్‌ను ఎన్నుకున్నారు. వైఎస్ జగన్‌ను తమ నేతగా ఎన్నుకోవడానికి కొత్తగా ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో భేటీ అయిన విషయం తెలిసిందే. సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుని.. పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకవాఖ్య తీర్మానం చేశారు. వైఎస్ జగన్‌ని శాసనసభపక్ష నేతగా ఎన్నుకుంటున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రతిపాదించగా దానికి ఎమ్మెల్యేలందరూ ఆమోదం తెలిపారు.
సమావేశం ముగిశాక జగన్.. రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలవడానికి హైదరాబాద్ బయలు దేరతారు. జగన్ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేల ప్రతినిధి వర్గం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి శాసనసభాపక్షం తీర్మానం కాపీని అందజేసి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేయనున్నారు.
అనంతరం అక్కడి నుంచి ప్రగతిభవన్‌కు వెళ్లనున్న జగన్… తన ప్రమాణస్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించనున్నారు. రేపు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న జగన్.. నరేంద్రమోదీని కలిసి శుభాకాంక్షలు చెప్పనున్నారు.
