Sunday, May 5, 2024
- Advertisement -

తెలంగాణలో మహాకూటమికి అదే అసలు సమస్య

- Advertisement -

2004లో చంద్రబాబును ఎదుర్కోవడానికి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్ మహాకూటమిగా ఏర్పడ్డాయి. అన్నీ కలసి చంద్రబాబును ఓడించాయి. 2009లో సీన్ రివర్స్ అయింది. ఈ సారి టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలు కలిశాయి. మహాకూటమిగా ఏర్పడి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఢీకొట్టాయి. కానీ ఓడించలేకపోయాయి. రెండోసారి కూడా వైఎస్ఆర్ సీఎం అయ్యారు. ఈ రెండు అనుభవాలు తేల్చింది ఏంటంటే.. మహాకూటమి కట్టినంత మాత్రాన గెలుపు గ్యారంటీ కాదు. గెలవచ్చు. గెలవకపోవచ్చు.

ఇప్పుడు మళ్లీ తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించడానికి విపక్షాలు ఏకమవుతున్నాయి. కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు జట్టు కడుతున్నాయి. వీటితో ఎంఐఎం, జనసేన, బీజేపీ జట్టు కట్టకపోవచ్చు. ఈ మూడు పార్టీలు కేసీఆర్ కు తెరవెనుక మిత్రులే. కనుక కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు మాత్రమే ఈ సారి మహాకూటమిలో ఉండే అవకాశముంది. అయితే కూటమి కట్టినంత మాత్రాన వీళ్ల సర్వశక్తులు, ఓట్లు ఓకపక్షంగా తాము అనుకున్నట్టే వేస్తారనే నమ్మకం లేదు. పార్టీల బలం ఏకమవ్వాలి. క్షేత్రస్థాయిలో తమలో తమకు గొడవలు, పంచాయతీలు లేకుండా మంచి సమన్వయంతో ముందుకెళ్లాలి. లేదంటే వీళ్ల ఐక్యతను దెబ్బ తీయడానికి కేసీఆర్ లాంటి మహా మాటకారి విభేదాలు రెచ్చగొడతారు. తనదైనశైలిలో చాలా సింపుల్ గా వీరి మధ్య అగ్గి రాజేయగల సమర్ధుడు ఆయన. దశాబ్దాల నుంచీ కొట్టుకు చచ్చే మీరు ఏకమవడం ఏంటి ? అని పుల్లవిరుపు మాటలతో వెటకారంతో మహాకూటమిలోని పార్టీల మధ్య సఖ్యతను క్షణాల్లో చెడగొట్టగల మహాముదురు కేసీఆర్. కావున క్షేత్రస్థాయి నుంచి కూటమిలోని పార్టీలు చాలా బలంగా ఉండాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా, కూటమిలోని పార్టీలను ఒకేమాట మాద నిలబెట్టే నాయకత్వం కావాలి.

మరో ప్రధాన సమస్య ఏంటంటే టీఆర్ఎస్ గెలిస్తే సీఎం కేసీఆరే అవుతారు. అందులో అనుమానం లేదు. ఒకవేళ ఇంటిపోరు ఎక్కువైతే ఆయన కుమారుడికి పట్టాభిషేకం జరపవచ్చు. కానీ మహాకూటమిగా ఏర్పడుతున్న పార్టీల్లో ఆ పరిస్థితి కానరావట్లేదు. కూటమి విజయం సాధిస్తే ఎవరు సీఎం అభ్యర్ధి అనేది ఎన్నికల తర్వాతే తేల్చుతామంటారు. అధికార పార్టీ ముందే ఫలానా వ్యక్తి మా సీఎం అభర్ధి అని చెబుతుంది. కానీ మహాకూటమిలో అలాంటి పరిస్థితి కనిపిచండం లేదు. ఇంతవరకూ కాంగ్రెస్ కూడా ఫలానా వ్యక్తే మా పార్టీ తరఫున సీఎం అభ్యర్ధి అని చెప్పడం లేదు. ముందు గెలవండి తర్వాత చూద్దాం అంటోంది. అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉండే కాంగ్రెస్ లో సీఎం సీటుపై కన్నేసిన సీనియర్లు అనేకమంది ఉన్నారు. వారిలో వారికి సఖ్యత కుదిరి, ఒకరికొకరు ఎంతవరకూ సహకరించుకుంటారు ? అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

2009లో వైఎస్ఆర్ కు వ్యతిరేకంగా మహాకూటమి కట్టినా కాంగ్రెస్ గెలిస్తే సీఎం వైఎస్ఆరే అని ముందే చెప్పడం కలిసొచ్చింది. వైఎస్ఆర్ ని దృష్టిలో పెట్టుకుని అటు నాయకులు, ఇటు కూటమి శ్రేణులు శ్రమించాయి. ఓట్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు కూడా మహాకూటమి నుంచి వైఎస్ లాంటి బలమైన నాయకుడు ఉంటే గెలుపు సాధ్యమే. కానీ మాహాకూటమి కట్టే పార్టీల మధ్య అలాంటి పరిస్థితి కానరావట్లేదు. కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు అన్నీ కలిసినప్పుడు ప్రధాన ప్ర….శ్న సీఎం అభ్యర్ధి ఎవరు ? మహాకూటమిని నడిపించే నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగించుతారు. ? ఆ ఫలానా వ్యక్తి నాయకత్వంలో ఎంతవరకూ అందరూ సహకరించుకుని పని చేస్తారు ? అన్నదే ప్రధాన సమస్య.

ప్రతిపక్షాలు కూటమి కట్టినంత మాత్రాన విజయం సాధించలేవు. తమ తరఫున సీఎం అభ్యర్ధి ఎవరో చెప్పుకోగలగాలి. చర్చల్లో, అధికార పార్టీ లొసుగులను గట్టిగా ఎండగట్టే బలమైన వాక్చాతుర్యం ఉన్న నేతలు కావాలి. డిబేట్లలో ఆ పార్టీని ఇరికించే దమ్ముండే లీడర్స్ ఉండాలి. అలాంటి దమ్మున్న నాయకుడు, కేసీఆర్ మాటలగారడీని కట్టడి చేసే మొనగాడు మహాకూటమికి కావాలి. ముఖ్యంగా కేసీఆర్ వేసే కౌంటర్లకు డిఫెన్స్ ఆడటం కాదు. కేసీఆర్ మీదే బలమైన కౌంటర్లు వేసి, ఆయన్నే డిఫెన్సులో పడేయాలి. అప్పుడే కేసీఆర్ ను ఓడించగలరు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -