Saturday, May 4, 2024
- Advertisement -

కుల, మత, అవినీత రహిత సమాజం గురించి మాట్లాడే అర్హత పవన్‌కి ఉందా?

- Advertisement -

‘కుల, మత, అవినీతి రహిత సమాజ స్థాపనే నా లక్ష్యం…….’ ప్రజల్లోకి వచ్చిన ప్రతి నాయకుడూ చెప్పే మొదటి మాటలు ఇవే. దశాబ్ధాలుగా నాయకులందరూ కూడా ఇవే కథలు వినిపిస్తూ ఉన్నారు. 2009లో యువరాజ్యం అధినేతగా ఆవేశపడిపోయి……. కుర్చీ ఆశ నెరవేరకపోవడంతో ఆ తర్వాత చల్లబడిపోయి……. 2014లో చంద్రబాబు అండతో, చంద్రబాబు కోసం మరోసారి రంగంలోకి దిగిన జనసేనుడు కూడా ఇఫ్పుడు ఇవే మాటలు చెప్తున్నాడు. కాకపోతే అసలు పవన్‌కి ఆ మాటలు చెప్పే అర్హత కూడా లేదు అని పవన్ రాజకీయ వేషాలను చూస్తున్నవారు చెప్తున్నారు.

ఒక ఎమ్మెల్సీ సీటు కోసం ఐదు కోట్లకు బేరం పెట్టడం……… యాభై లక్షల క్యాష్‌తో ఆడియో, వీడియో సాక్ష్యాలతో పట్టుబడడం……ఒక పార్టీ అధినేతనే ‘బ్రీఫ్డ్ మీ’ అని చెప్పి ఆ నీచ రాజకీయానికి పాల్పడడం అవినీతి కిందకురాదా? అవినీతి కాదా? పవన్ దృష్టిలో మాత్రం కాదు. అలా ఎందుకు అని ప్రశ్నిస్తే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాధినేతలను బలహీనపరచకూడదని సంయమనం పాటించాను అంటాడు. బహుశా పవన్‌కి తెలుసో తెలియదో తెలియదు కానీ ఇప్పటివరకూ అవినీతికి పాల్పడిన నాయకులందరూ కూడా ప్రజలచే ఎన్నుకోబడి అధికారంలో ఉన్నవాళ్ళే. అసలు అధికారంలో ఉంటేనే కదా……..అవినీతికి పాల్పడడానికి అవకాశం ఉంటుంది. అధికారంలో ఉన్నవాళ్ళు అవినీతికి పాల్పడినా కూడా తప్పు పట్టకూడదు అనేలా సూత్రీకరించిన జనసేనుడు ఇక ఎవరి అవినీతిపై పోరాటం చేస్తాడట?

‘నా భార్య క్రిష్టియన్, నా కూతురిని క్రిష్టియన్ పద్ధతుల్లో పెంచుతున్నా’ అని ఆ మధ్య ఒక బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పాడు. ఆ మాటలు ఏ ఉద్ధేశ్యంతో చెప్పినట్టు? ఇక తాజాగా తెలంగాణా యాత్రకు బయల్దేరే ముందు రోజు మీడియాను తీసుకెళ్ళి చర్చిలో ప్రార్థనలు చేసిన పవన్, ఆ మరుసటి రోజు తన క్రిష్టియన్ భార్య(ఈ మాట పవన్‌దే) చేత కొబ్బరికాయ కొట్టించి, తన నుదుట తిలకం దిద్దించుకున్నాడు. ఆ ఎపిసోడ్ మొత్తం మీడియాలో ప్రముఖంగా వచ్చేలా ప్రచారం చేయించుకున్నాడు. అలాగే కాపులకు రిజర్వేషన్స్ ఐదు శాతమే ఇవ్వడమేంటి? మాట ఇచ్చి తప్పుతారా? అంటూ కాపుల రిజర్వేషన్స్ ఇంకా పెంచాలన్నట్టుగా మాట్లాడాడు పవన్.

జాతీయ సమగ్రతకు భంగం వాటిల్లే రాజకీయాలు ఎప్పుడూ చేయనని చెప్పుకునే పవన్ దక్షిణ భారతదేశం అంటూ చేసిన రాజకీయం అంతా ఇంతా కాదు. 2014 ఎన్నికల తర్వాత తనను పట్టించుకోవడం మానేసిన మోడీపైన ఉన్న కోపంతో మోడీని దెబ్బకొట్టాలన్న లక్ష్యంతో దక్షిణ భారతదేశం అంటూ రాజకీయం చేయాలని చూశాడు పవన్. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించినప్పుడు ఆ ప్రాంతం గురించి గొప్పగా మాట్లాడడం, విభజనను తప్పు అన్నట్టుగా చెప్పడం……..తెలంగాణా పర్యటనలో మాత్రం జైతెలంగాణా నినాదం ‘వందేమాతరం’ నినాదంతో సమానమని చెప్పడాన్ని ఏ రాజకీయం అనాలి.

నీతి, నిజాయితీ, కుల, మత, అవినీతి రహిత సమాజం లాంటి నినాదాలు చెప్పడం ఏముంది పవన్? ఐదో తరగతి పిల్లాడు కూడా అద్భుతంగా చెప్పగలడు. నువ్వు నట నాయకుడివి కాబట్టి ఇంకాస్త అభినయాన్ని జోడించి చెప్పగలవ్…….స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచీ మన నాయకులు అందరూ కూడా చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు నువ్వు కూడా అవే మాటలు చెప్తున్నావ్. ఆచరణలో ఒక్క శాతం కూడా అనుసరించని వాళ్ళకు ఆయా మాటలు ఉచ్ఛరించే అర్హత ఉంటుందా పవన్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -