ఆంధ్రప్రదేశ్ లో విపక్ష వైసీపీలోకి రాజకీయ వలసలు జోరందుకున్నాయి. ఇప్పటికి ముగ్గురు ఎంఎల్ఏలు, ఇద్దరు ఎంపిలు టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ప్రధానంగా బలమైన అభ్యర్తులను పార్టీలో చేర్చుకొనేందుకు వైసీపీ పావులు కదపుతోంది. ఇప్పటికే వలసల ద్వారా పార్టీని బలోపేతం చేస్తున్న జగన్ మరి కొందరి నాయకులపై దృష్టిపెట్టారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి , జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఇద్దరు నేతలు వైసీపీలో చేరుతున్నారనే వార్తలు గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి. ఎన్నికలు ఎక్కువ సమయం లేకపోవడంతో ముందుగానె పార్టీలో చేరి తమ స్థానాలను పదిలం చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే జూ.ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు చేరుకున్న వీరిద్దరిని జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కొద్ది రోజుల క్రితమే నార్నె శ్రీనివాసరావుతో పాటు కృపారాణి గతంలోనే జగన్ తో భేటీ అయ్యారు. అప్పుడే పార్టీలో చేరుతారని అనుకున్నా జరగలేదు. మంచి ముహూర్తం లేకపోవడంతో చేరిక వాయిదా పడింది. తాజాగా మంచి మహూర్తం చూసుకొని వీరిద్దరు ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
వైసీపీలో చేరిత తర్వాత నార్నె మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా మారాయి. తాను గత పదేళ్ల నుంచి వైసీపీతో అనుబంధం కొనసాగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జగన్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. టికెట్ ఆశించి పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు. మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ మద్దతుకూడా నార్నెకి అని వచ్చిన వార్తలపై కూడా స్పందించారు. తాను వైసీపీలో చేరడానికి.. తన అల్లుడు జూ.ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
