Sunday, May 5, 2024
- Advertisement -

అత్యాశతో అసలుకే ఎసరు

- Advertisement -

అనువుగాని చోట అధికులమనరాదు. ఈ సామెత తెలంగాణలో పొత్తుల కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐ నేతలకు ఎందుకు గుర్తు రావడంలేదో ? తమ లక్ష్యం అధికార పార్టీని ఓడించడం. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించడం. అని చెబుతున్నారు వీళ్లంతా. అందుకోసమే తామంతా పొత్తులు పెట్టుకుంటున్నట్టు ప్రకటిస్తున్నారు. కానీ సీట్ల పంపకాలు, పోటీ విషయంలో పొంతన లేకుండా తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారు. పొత్తులో భాగంగా మిత్రపక్షాలను శక్తికి మించి స్థానాలు అడిగి తీసుకుని ఏం సాధిస్తారో అర్ధం కాని పరిస్థితి. జట్టుకడుతున్న పార్టీల ధోరణి చూస్తుంటే..వీళ్లలో వీళ్లే బలప్రదర్శనకు అత్యుత్సాహం చూపుతున్నారు తప్ప. వాస్తవ పరిస్థితులను గ్రహించలేకపోతున్నారు. మహాకూటమిగా ఏర్పడ్డాక, ఆ పొత్తులో భాగంగా తమ పార్టీకి తక్కువ సీట్లు కేటాయిస్తే…దాన్ని చిన్నతనంగా భావిస్తున్నారే తప్ప ప్రాక్టికల్ గా ఆలోచించడం లేదు. గ్రౌండ్ లెవల్లో తమ పార్టీ బలమెంత ? తమ పార్టీకి ఉన్న కార్యకర్తలు ఎందరు ? ఆర్ధిక వనరులు ఏంటి ? తమ గెలుపునకు కలిసి వచ్చే అంశాలేంటి ? ప్రత్యర్ధి బలమెంత ? అనే అంచనాలు వేసుకోకుండా ఫాల్స్ ప్రెస్టేజ్ తో అన్ని సీట్లు కావాలి. ఇన్ని సీట్లు కావాలి అని అనవసర డాంభికాలు పలుకుతున్నారు. కేసీఆర్ అభ్యర్ధులను ప్రకటించేసి ఇప్పటికే 15 రోజులు కావస్తోంది. ఆయా క్యాండిడేట్లు తమ ప్రచారాన్ని కూడా మొదలు పెట్టేశారు. నియోజకవర్గాల్లో జోరుగా తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కానీ విపక్షాలు ఇంకా పొత్తులు కూటమిలు అంటూనే కాలక్షేపం చేస్తున్నాయి. ఇంతవరకూ అభ్యర్ధుల మాట దేవుడెరుగు ? పొత్తులు కూడా ఖరారు కాలేదు. అవి ఖరారయ్యాక సీట్ల పంపకాల సిగపట్లు ఉండనే ఉంటాయి. ఆ తర్వాత అలకలు, అసంతృప్తులు తప్పవు.

ఇవన్నీ ఊహించే కేసీఆర్ రెండో మాట లేకుండా అసెంబ్లీ రద్దు చేసిన రోజే అభ్యర్ధులను ప్రకటించేశారు. ఆ వెంటనే అసంతృప్తులను బుజ్జగించడాలు కూడా మొదలుపెట్టేశారు. కొండ సురేఖ దంపతులు లాంటి రెబల్స్ కాస్తా గట్టిగానే కస్సుబుస్సులాడినా, వారిని కూడా మెల్లగా దారిలోకి తెచ్చేశారు. ఇక చర్చల తర్వాత వారు కూడా పార్టీ మారే ఆలోచన విరమించుకున్నట్టేననే వార్తలు వస్తున్నాయి. అటు టికెట్ నిరాకరించిన బాబూమోహన్, ఓదేలును కూడా కేసీఆర్ దువ్వేశారు. అంసతృప్తులను దాదాపు దారిలోకి తెచ్చుకున్నట్టే. కేసీఆర్ స్ట్రాటజీ కూడా ఇదే తాను ముందే అభ్యర్ధుల ఎంపిక, అసంతృప్తుల బుజ్జగింపులు చేసేస్తే…అప్పటికి ఇంకా ప్రతిపక్షాలు అభ్యర్ధుల ఎంపికలోనే మల్లగుల్లాలు పడతారు, వారి సమయమంతా పొత్తులు, సీట్ల పంపకాలు, అభ్యర్ధులు ఎంపిక వద్దే గడిచిపోతుంది. ఆ తర్వాత ఎటూ కేసులు పంచాయతీలు ఉండనే ఉంటాయని కేసీఆర్ ప్లాన్ చేసుకున్నారు. ఆయన మొదటి ప్లాన్ సూపర్ సక్సెస్ అయినట్టే.

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తో పొత్తుకు సై అంటున్న టీడీపీ 30 సీట్లను, టీజేఎస్ 15 స్థానాలు, సీపీఐ 8 సీట్లు డిమాండ్ చేస్తున్నాయి. రాజకీయ పార్టీగా ఇంకా ఇప్పుడిప్పుడే కేడర్‌ను సమకూర్చుకుంటున్న తెలంగాణ జన సమితి సైతం 15 సీట్లు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉంది. వాస్తవాలు గ్రహించలేక, తమ బలాన్ని, గెలిచే స్థానాలను కచ్చితంగా అంచనా వేసుకోలేక కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ నేలవిడిచి సాము చేస్తున్నాయి. మొత్తానికి వీళ్లు పొత్తులు, సీట్లు అంటూ బేరసారాలు పూర్తి చేసేలోపే కేసీఆర్ మళ్లీ గద్దెనెక్కడం ఖాయంలా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -