Friday, May 3, 2024
- Advertisement -

మీ ఫోన్ కాల్ రికార్డ్ అవుతోంది జాగ్రత్త

- Advertisement -

ఎవరిని నమ్మాలి ? ఎవరిని నమ్మకూడదు ? అనే ప్రశ్నలు తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలను వేధిస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ఎమ్ఐఎమ్, వైఎస్ఆర్సీపీ, సీపీఐ, సీపీఎం, జనసేన, టీజేఎస్..అన్ని పార్టీలకు, నేతలకు ఫోన్ కాల్స్ భయం వెంటాడుతోంది. ఎన్నికలన్నాక, పార్టీలన్నాక, అభ్యర్ధుల ఖరారు కోసం సవాలక్ష చర్చలు జరుపుతారు. అన్ని పార్టీల ఆఫీసులు హైదరాబాద్ లోనే ఉండటంతో, రాజధాని కేంద్రంగానే పార్టీ వ్యవహారాలు, కీలక చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ చర్చలన్నీ ఫోన్లలో జరుపుకోలేని పరిస్థితి. పోనీ ఆఫీసులకు వెళ్లి నాయకులంతా కూర్చుని మాట్లాడుకుందామంటే ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతున్నాయి. అందరూ ఆఫీసులకు చేరుకుని చర్చలు జరపాలంటే, ట్రాఫిక్ సమస్యలతో పుణ్యకాలం పూర్తయిపోతోంది. ఈ నేపథ్యంలో సెల్ ఫోన్లలో కీలక అంశాలు చర్చించలేకపోతున్నారు. అభ్యర్ధుల ఎంపిక, ఎత్తుకు పైఎత్తులు, ప్రలోభాలు, బెదిరింపులు, బుజ్జగింపులు, ప్రత్యర్థుల పార్టీల్లో రెబల్స్ ను రెచ్చగొట్టి, ఆయా పార్టీలపై తిరుగుబాటు అభ్యర్ధులుగా బరిలో దించడాలు, కొన్ని స్థానాల్లో ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధి గెలుపు కోసం, సొంతపార్టీ నుంచి బలహీనమైన అభ్యర్థిని బరిలో దించడం, ఇతర పార్టీల్లోని కీలక అంశాలు, చర్చలు, నిర్ణయాలు, వ్యూహప్రతివ్యూహాలు, అధినేతల ఆలోచనలు అన్నీ తెలుసుకోవటానికి కోవర్టుల ఏర్పాటు. నేతల రేట్లు, పోటీ చేస్తే ఎంత ? పోటీ నుంచి తప్పుకోవాలంటే ఎంత ? ఎవరిని ఏ కేసులో ఇరికించాలి ? ఎప్పుడు ? ఎక్కడ ? ఎలాంటి అంశాలను లేవెనెత్తాలి ? జనాన్ని ఎలా రెచ్చగొట్టాలి ? ఓటర్లకు ఏ రకమైన బిస్కట్లు వేయాలి ? అంగబలం, అర్ధబలం ఉపయోగించడాలు. ఓటుకు రేటు నిర్ణయించడాలు ఇవన్నీ ఉంటాయి. ఈ అంశాలన్నీ ఫోన్లలో మాట్లాడాలంటే అన్ని పార్టీల నేతల వెన్నులోనూ వణుకు మొదలవుతోంది.

అధికారులను గుప్పిట్లోకి తెచ్చుకోవటానికి ఏం ఉపయోగించాలి ? కులం ఫీలింగుతో దారిలోకి తెచ్చుకోవడం. ప్రమోషన్లు, భారీ ప్రలోభాలు ఇవ్వడం. ట్రాన్స్ ఫర్ల బెదిరింపులు, అవినీతి కేసులు పెడతామంటూ హెచ్చరికలు, పోల్ మేనేజ్ మెంటులో సహకరించాలని అభ్యర్ధనలు, ఆదేశాలు, రిక్వెస్టులు, డిమాండ్లు, వార్డు స్థాయిల్లో ఎదురు తిరిగే వారికి పోలీస్ కేసులు పెట్టమని ఆర్డర్లు, ఇలా ఒకటా ? రెండా ? సవాలక్ష వ్యవహారాలు, మంతనాలు ఉంటాయి. వీటన్నింటినీ నాయకులు ఫోన్లలో మాట్లాడలేక, ఉండలేక, కిందామీదా పడుతున్నారు. ఎవరినీ నమ్మలేక, ఏ ఫోన్లో ఎవరి వాయిస్ రికార్డు అయిపోతోందో తెలుసుకోలేక, ఎవరి వాయిస్ ఎప్పుడు ? ఎలా ? ఏ మీడియా ద్వారా బయటకొస్తుందో తెలియక సతమతమవుతున్నారు.

పెరిగిన టెక్నాలజీ ఎవరి కొంప ముంచేస్తుందో అనే భయంతో ఫోన్లలో చర్చలకు వెనకడుగేస్తున్నారు. ఎవరి కోవర్టు ఎవరో తెలియక ? ఎవరికి ఎవరు అమ్ముడుపోతారో ? అంచనావేయలేక వ్యూహాలకు పదును పెట్టడంలో, వాటిని అమలు చేయడంలో తడబడుతున్నారు. ఈ సమస్య ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. అన్ని పార్టీల్లో ఉన్నదే. గతంలో పలు వాయిస్ రికార్డులు, బయటపడి ఎంత దుమారం రేపాయో, జాతీయస్థాయిలో ఎంత కలకలం సృష్టించాయో తెలియంది కాదు. మొన్న కర్నాటక ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల్లోనూ, బేరసారాలు, బెదిరింపులు,బుజ్జగింపుల వాయిస్ కాల్సే బీజేపీ నేతల కొంప ముంచేసింది. ఆ వాయిస్ కాల్స్ రేపిన దుమారం అంతాఇంతా కాదు. కర్నాటకలో అనే కాదు అన్ని చోట్లా ఇదే పరిస్థితి. దీంతో తెలంగాణలో నాయకులున్నారు కానీ నమ్మకమే లేదు. అని చెప్పక తప్పదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -