Monday, May 6, 2024
- Advertisement -

బీజేపీలో సత్తా లేకే కేసీఆర్ తో మోడీ దోస్తీ

- Advertisement -

టీడీపీ అవసరం తెలంగాణకు లేదని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తీసిపారేశారు. కాంగ్రెస్ టీడీపీ పొత్తు అనైతికమని మండిపడ్డారు. చంద్రబాబునాయుడు తన వైఫల్యాలను బీజేపీపై రుద్దేస్తున్నారని ఆక్రోషం వెళ్లగక్కారు. ఫిరాయింపులను ప్రోత్సహించి టీఆర్ఎస్ విలువలకు తిలోదకాలు ఇచ్చేసిందని ఆవేదన కూడా వ్యక్తం చేసేశారు. తెలంగాణలో సకల దరిద్రాలకు కాంగ్రెస్ కారణమని కూడా తేల్చి పారేశారు. మీడియా వినాలే కాని, ఇంకా ఇంకా కిషన్ రెడ్డి చెప్పేస్తుంటారు. కానీ తెలంగాణకు తమ బీజేపీ అవసరం ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేయరు. మోడీకి తమ మీద నమ్మకం లేకే టీఆర్ఎస్ తో రహస్య స్నేహం చేస్తూ, ముందస్తుకు సహాయసహకారాలు అందిస్తున్నారనే వాస్తవాన్ని అంగీకరించారు. తమ అసమర్ధత గురించి శ్రేయోభిలాషులు చెప్పినా చెవికెక్కించుకుంటారనే నమ్మకం కూడా లేదు. కానీ కిషన్ రెడ్డి సహా తెలంగాణ బీజేపీ కళ్లు తెరిపించాల్సిన అవసరం బాధ్యత వారి అభిమానులకుంది. అందుకే ఆద్య న్యూస్ స్పెషల్ స్టోరీ. సూటిగా సుత్తిలేకుండా మీ కోసం…

టీడీపీ అవసరం తెలంగాణకు ఉందో లేదో ప్రజలు తేల్చుతారు. ఆ విషయం గురించి కిషన్ రెడ్డి మాట్లాడేముందు తమ బీజేపీ అవసరాన్ని తెలంగాణ ప్రజలు ఎంతవరకూ గుర్తించారో…! ఎంత వరకూ ఆదరిస్తున్నారో..! తెలంగాణ రాష్ట్రమివ్వడంలో కాంగ్రెస్ తో పోటీపడి మరీ ఇచ్చినందుకు ఎంత కృతజ్ఞత చూపారో ? బీజేపీకి గత ఎన్నికల్లో కట్టబెట్టిన ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఎన్నో ? ఓ సారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. గత ఎన్నికల్లో దేశమంతా బీజేపీ సత్తా చాటింది. దేశచరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తూ బీజేపీ అధిక సంఖ్యలో ఎంపీ స్థానాలు గెల్చుకుంది. అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారం దక్కించుకుంది. కానీ తెలంగాణలో చతికిల పడింది. ముక్కుతూ మూలుగుతూ 4 ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానం గెల్చుకుంది. అది వారి స్థాయి. మోడి ప్రభంజనం వల్లే ఏపీలో టీడీపీ గెల్చిందని చెప్పుకుంటారు. మరి మోడీ ప్రభంజనం తెలంగాణలో ఎందుకు లేదో ? కూడా చెబితే బాగుంటుంది. లేక తెలంగాణ రాష్ట్ర బీజేపీ అసమర్ధత వల్లే మోడీ ప్రభంజనం అక్కడ పని చేయలేదా ?

తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్ ఎంత పాటుపడిందో అంతే స్థాయిలో బీజేపీ కూడా ఉత్సాహం చూపింది. కానీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు టీఆర్ఎస్ తర్వాత అధిక సీట్లు కట్టబెట్టారు. టీఆర్ఎస్ 63 స్థానాలు, కాంగ్రెస్ 21, టీడీపీ 15 ఎమ్మెల్యే స్థానాలను గెల్చుకున్నాయి. ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీకి మూడో స్థానం ఇచ్చారు. కానీ జాతీయ పార్టీ, తెలంగాణ ఇవ్వడంలో సహకరించినా, మోడీ హవా ఉన్నా బీజేపీ అడ్రస్ మాత్రం తెలంగాణలో గల్లంతయింది. సోదిలో ఉన్నామని చెప్పుకోవడానికి 4 ఎమ్మెల్యే స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి దీన్ని బట్టి టీడీపీ అవసరం తెలంగాణకు లేదని ప్రజలు భావిస్తున్నారా ? లేక బీజేపీ అవసరం లేదని భావిస్తున్నారో ? ఓ సారి కిషన్ రెడ్డి గారే సెలవిస్తే బాగుంటుంది. పైగా ఈ సారి కూడా ముందస్తుకు వెళ్లాలని నిర్ణయించుకున్న కేసీఆర్ కు జోనల్ వ్యవస్థకు ఆమోదం సహా అన్ని రకాలుగా మోడీ సహకరిస్తున్నారు. అంటే అర్ధమేంటి ? తెలంగాణ బీజేపీలో దమ్ము, చేవ, సత్తా ఉన్న నాయకులు లేరనే కదా ? అవే ఉంటే కేంద్రంలో అఖండ మెజార్టీతో బీజేపీ అధికారంలో ఉండగా ఇక్కడ రాష్ట్రంలో దూసుకుపోయి ఉండేవాళ్లు. ఈ నాలుగేళ్లలో సత్తా చాటుకుని, వచ్చే ఎన్నికల రేసులో నంబర్ వన్ స్థానంలో నిలబడే వాళ్లు. కానీ వీరిలో సమర్ధత లోపించడం వల్లే అలా దూసుకుపోలేకపోయారు.

వీరిని నమ్ముకుంటే, వచ్చే ఎన్నికల్లో ఆ నాలుగు ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానం కూడా రాదని మోడీ, షా పసిగట్టేశారు. అందుకే కిషన్ రెడ్డి వంటి అసమర్ధులను నమ్ముకోలేకే కేసీఆర్ వంటి డైనమిక్ లీడర్ తో రహస్య స్నేహం చేశారు. ఈ విషయాలను కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు అంగీకరించలేరు. సద్విమర్శను స్వీకరించి లోటుపాట్లను దిద్దుకోలేరు. ఒక్కోసారి కిషన్ రెడ్డి తన సన్నిహితుల వద్ద ఓ మాట చెప్పుకుంటూ ఉంటారు . అప్పట్లో ఆర్ఎస్ఎస్ లో నేను మోడీ సమకాలీకులం అని. విదేశాల్లో ఒకే స్థాయిలో, ఆర్ఎస్ఎస్ కోసం పని చేశాం, అని. ఆయన చెప్పిందే నిజమైతే ఒకే స్థాయిలో పనిచేసిన మోడీ ప్రస్తుతం ఎక్కడున్నాడు ? కిషన్ రెడ్డి ఎక్కడున్నాడు ? కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ ఏమాత్రం పుంజుకోలేదు. దీంతో లక్ష్మణ్ కు బాధ్యతలు అప్పగించారు. అయినా ఫలితం సున్నా. కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే, వీళ్లు రాష్ట్రంలో పుంజుకోలేకపోతున్నారంటే…వీళ్ల మీద నమ్మకం లేకనే బీజేపీ పెద్దలు కేసీఆర్ కు సహకరిస్తూ, స్నేహం చేస్తున్నారంటే వీరి స్థాయి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణ ప్రజలు బీజేపీ అవసరం లేదని భావిస్తే పర్వాలేదు. కానీ తెలంగాణలో దశాబ్దాలుగా ఎదుగూ బొదుగూ లేని తమ పార్టీ, ఆ పార్టీలో కాలం గడుపుకొస్తున్న నేతలే అవసరం లేదని బీజేపీ పెద్దలు అనుకుంటే మాత్రం, కిషన్ రెడ్డే కాదు తెలంగాణ బీజేపీ నేతలంతా దుకాణం బంద్ చేసుకోవాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -