టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కీలక మైలురాయిని చేరుకుంది. 2017 నవంబర్ 26న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించిన జగన్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఆయన అడుగు పెట్టడంతో 100 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా నేడు జగ్గంపేట నియోజకవర్గంలో పాదయాత్రతో జగన్ సెంచరీ పూర్తి చేశారు. మొత్తం 100 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయడానికి ఆయనకు 222 రోజులు పట్టింది. వైఎస్‌ఆర్ జిల్లా, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తి చేసుకుని తూర్పు గోదావరి జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర ప్రవేశించింది. జగ్గంపేట నియోజకవర్గంలోని నేషనల్ హైవే పక్కనున్న బాలాజీనగర్ లో నేడు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నియోజకవర్గం తర్వాత పిఠాపురం నియోజకవర్గం మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. మొత్తానికి ఓ వైపు కోర్టుకు ప్రతి శుక్రవారం హాజరవుతూనే, టీడీపీ అడ్డంకులను ఎదుర్కొంటూనే 10 జిల్లాల్లో 222 రోజుల్లో 100 నియోజకవర్గాల్లో విజయవంతంగా జగన్ పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. అలుపెరుగని ఆయన పోరాటస్పూర్తి వైఎస్ఆర్ సీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపుతోంది.
జగన్ పాదయాత్ర ప్రారంభం నుంచీ అశేష జనం తరలివస్తున్నారు. దారి పొడవునా నీరాజనం పలుకుతున్నారు. పింఛన్లు రావడం లేదని. రేషన్ కార్డులు కట్ చేసేశారని, ఇళ్లు ఇవ్వాలంటే టీడీపీ నాయకులు, జన్మభూమి కమిటీలకు లంచాలు సమర్పించుకోవాల్సి వస్తోందని జనం తమ బాధలు చెప్పుకుంటున్నారు. ఒక ఇల్లు మంజూరు చేయాలంటే కనీసం 25 వేల నుంచి 30 వేల రూపాయల వరకూ టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీల కార్యకర్తలకే సమర్పించుకోవాల్సి వస్తోందని జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. మరోవైపు అంగన్ వాడీ ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు, చేనేత కార్మికులు, లెక్చరర్ల సంఘాలు, వికలాంగులు, డ్వాక్రా మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాల వారు ప్రభుత్వ తీరుపై తమ అసంతృప్తిని జగన్ వద్ద వెళ్లగక్కుతున్నారు. చంద్రబాబు ఇంటింటికీ ఉద్యోగమిస్తామని చెప్పుకొచ్చారని, బాబు వస్తే జాబు వస్తుందని ఆశ పెట్టారని. కానీ ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదు కదా ఉన్న ఉద్యోగాలనే ఊడబీకేస్తున్నారని ఫిర్యాదులు చేశారు. రైతు రుణమాఫీ మీద కూడా అసంతృప్తి తప్పడం లేదు. పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. డ్వాక్రా మహిళలు తమను పూర్తిగా ముంచేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా రుణాలు అన్నీ మాఫీ చేస్తానని చెప్పి, చేయకపోవడంతో తాము వడ్డీలు కట్టలేక చస్తున్నామని జగన్ వద్ద లబోదిబోమంటున్నారు. నిరుద్యోగ భృతి ఊసే లేదని యువత మండిపడుతోంది.
మొత్తానికి ఆ వర్గం ఈ వర్గం అని తేడా లేదు. దాదాపు అన్ని వర్గాల ప్రజలు టీడీపీ పాలనపై ప్రజాసంకల్పయాత్రలో జగన్ కు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇంకెన్నాళ్లీ పాలనను భరించాలని నిలదీస్తున్నారు. ప్రారంభం నుంచీ పాదయాత్రకు జనం భారీగా తరలివస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఊహించని రీతిలో విశేషంగా స్పందన లభిస్తోంది. జగన్ ఉపన్యాసలకు జనం నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో ఆనందం అంబరమంటుతోంది. వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం కావడం ఖాయమని, అందుకు వెళ్లువెత్తుతున్న ప్రజాభిమానమే నిదర్శనమని చెబుతున్నారు.
