రాయలసీమ వరకూ చూసుకుంటే జగన్ స్పీడ్‌ని ఇప్పట్లో అందుకోవడం చంద్రబాబు తరం కాదు. గ్రేటర్ రాయలసీమలో భాగం అయిన నెల్లూరు జిల్లాలో కూడా చంద్రబాబు పప్పులు ఉడకవు. అయితే 2014 ఎన్నికల్లో జగన్‌కి ఆ బలం సరిపోలేదు. అందుకే ఈ సారి చంద్రబాబు సొంత కోటల్లోనే పాగా వేయాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు జగన్. అందులో ముఖ్యంగా కులసమీకరణాలను పెద్దగా పట్టించుకోకుండా 2014లో దెబ్బతిన్న నేపథ్యంలో ఈ సారి మాత్రం కుల సమీకరణాల విషయంలో ఎన్నికలకంటే ముందుగానే చంద్రబాబుపై పేచేయి సాధించాలనుకుంటున్నాడు. అందుకు ప్రజా సంకల్పయాత్ర సాగుతున్న అన్ని జిల్లాల్లోనూ అన్ని కులాలు, వర్గాల నేతలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నాడు.
తాజాగా పశ్ఛిమ గోదావరి జిల్లాలో బిసీల సమావేశం నిర్వహించిన జగన్ టిడిపి కాస్త ఎక్కువ పట్టున్న బీసలను పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలా తన ఆలోచనలు బయటపెట్టాడు. ఓసీ నియోజకవర్గం అయిన రాజమండ్రి నుంచి ప్రస్తుతం మురళీమోహన్ ఎంపిగా ఉన్నాడు. అలాంటి నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో బీసీలకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చాడు జగన్. ఓట్ల కోసం బీసీలను వాడుకునే చంద్రబాబు గాలికిపోయే పేల పిండి లాంటి, అసలు అవకాశమేలేని తెలంగాణా ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇస్తానని అంటాడని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కనీస స్థాయిలో సీట్లు, మంత్రి పదవులు ఎప్పుడూ ఇచ్చింది లేదని బాబు చేసిన అన్యాయాన్ని వివరించాడు జగన్. అన్నింటికీ మించి నిధులు ఖర్చు చేసే విషయంలో, బీసీల సంక్షేమం విషయంలో వైఎస్‌కి, చంద్రబాబుకు ఉన్న తేడాను చూపించాడు జగన్.
అన్నింటికీ మించి 2019 ఎన్నికల్లో మురళీ మోహన్ గెలిచే అవకాశం లేదని, మురళీ మోహన్ వళ్ళ పార్టీకి ఏమీ ఉపయోగం ఉండడం లేదని చంద్రబాబే స్వయంగా మురళీ మోహన్‌తోనే చెప్పి ఉన్న నేపథ్యంలో వైకాపా కచ్చితంగా గెలిచే ఎంపి సీటును బీసీలకు ఇవ్వడంపై ఆయా వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఓసీలకు చెందిన ఎంపి సీటును బీసీ వర్గానికి కేటాయించడం బీసీ ఓటర్లను గట్టిగా ప్రభావితం చేస్తుందన్న విశ్లేషణలు టిడిపి నుంచే వినిపిస్తున్నాయి. ఇప్పటికే నవరత్నాలతో పాటు విద్యాకాలం మొత్తం కూడా ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించేలా, పౌరులందరి వైద్యం ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించేలా పథకాలు రచించిన జగన్ ఇప్పుడు సీట్ల విషయంలో కూడా బలహీన వర్గాలకు రిజర్వేషన్స్‌కి మించి న్యాయం చేసేలా కేటాయించడం చూస్తుంటే కుల సమీకరణాల విషయంలో ఈ సారి చంద్రబాబు కంటే జగన్‌పై చేయి సాధించడం ఖాయం అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
