Saturday, April 20, 2024
- Advertisement -

ఆ పాన్ ఇండియా డైరెక్టర్ కు.. ఫస్ట్ టైం రిస్కు తప్పదేమో..

- Advertisement -

దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి తన కెరీర్ లో మొదటి సారి రిస్కులో పడినట్లు కనిపిస్తోంది. ఇది వరకు ఈ మాట అంటే రాజమౌళికా… రిస్కా.. అనే వాళ్ళమేమోకానీ ప్రస్తుతం ఆయన రిస్క్ తప్పనిసరిగా ఫేస్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. మగధీర చిత్రీకరణ కు మొదటి సారి ఆయన రెండేళ్ల సమయం తీసుకోగా సినిమా విడుదలకు ముందు ఆయనపై విమర్శలు వచ్చాయి. ఒక సినిమా కోసం రెండేళ్లు తీసుకోవాలా.. అని అందరూ అన్నోళ్లే. కానీ సినిమా విడుదల అయ్యాక తెరపై ఆ భారీతనం, గ్రాఫిక్స్, హీరో ఎలివేషన్ అవన్నీ చూసి రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తారు.

ఆ తర్వాత రాజమౌళి కమెడియన్ సునీల్ తో ‘మర్యాద రామన్న’ తీసి బంపర్ హిట్ కొట్టి చూపాడు. ‘ఈగ’తోనూ మాయాజాలం చేశాడు. ఆ తర్వాత బాహుబలితో ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా చేశాడు. ఇలా రిస్కు ఎదురైన ప్రతీ సారి ఫేస్ చేస్తూ ముందుకెళ్లాడు రాజమౌళి. కానీ ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో మాత్రం జక్కన్న ఆందోళనలో ఉన్నాడు.

రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న ఈ సినిమా 2019 వేసవిలో షూటింగ్ మొదలవగా 2020 జూలై 31కి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇద్దరు అగ్ర హీరోలతో పాన్ ఇండియా మూవీ కావడంతో రూ. 350 నుంచి రూ.400 కోట్ల బడ్జెట్ పెట్టేందుకు నిర్మాత డీవీవీ దానయ్య ముందు కొచ్చారు. అయితే ముందు రాంచరణ్, ఆ తర్వాత ఎన్టీఆర్ గాయపడడంతో షూటింగ్ కాస్త డిలే అయ్యింది. దీంతో ఎప్పటిలాగే రాజమౌళి రిలీజ్ డేట్ మారుస్తూ 2021 జనవరి 8న సంక్రాతి పురస్కరించుకొని చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు.

ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా కొన్ని నెలలు సినిమా షూటింగులన్నీ ఆగిపోయాయి. ఆ తర్వాత రాజమౌళి, రామ్ చరణ్ కరోనా బారిన పడి చిత్రీకరణ ఆలస్యమైంది. ఇలా వరుసగా ఏదో ఒక అవాంతరంతో ఆర్ఆర్ఆర్ షూట్ డిలే అవుతూ వస్తోంది. సినిమా షూటింగ్ మొదలై రెండేళ్లు దాటిపోయింది. ఇక చూస్తుండగానే కరోనా సెకండ్ వేవ్ కూడా వచ్చి మళ్లీ షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. దీంతో బడ్జెట్ కూడా పెరుగుతూ వస్తోంది.

ఇప్పుడు కరోనా పరిస్థితులు తగ్గాక మిగిలిన షూటింగ్ కంప్లీట్ చేసి దసరాకు సినిమాను విడుదల చేసే యోచనలో రాజమౌళి ఉన్నాడు. సినిమా విడుదలకు ఇంకా ఐదు నెలల సమయం ఉండటంతో బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. అన్ని అవాంతరాలను అధిగమించి థియేటర్ లలోకి సినిమా వచ్చినా థియేటర్ల సీటింగ్ సామర్థ్యం 100 శాతం లేకపోతే మాత్రం బాహుబలి రేంజ్ కలెక్షన్లు వచ్చే అవకాశం లేదు.

లాంగ్ రన్ లో కలెక్షన్లు వస్తాయిలే అనుకున్నా బొమ్మ రిలీజ్ అయిన రాత్రికే నెట్లో పైరసీ ప్రింట్ పెట్టేసే రోజులివి. ఇన్ని సమస్యలు ఉండటంతో రాజమౌళి తొలిసారి రిస్కులో పడ్డట్లు కనిపిస్తోంది. అయితే ఇన్ని సమస్యల్లో కూడా ఊరటనిచ్చే విషయం ఏంటంటే అన్ని భాషల శాటిలైట్ హక్కులు రూ. 300కు పైగా కోట్లకు అమ్ముడు పోవడం. ఇద్దరు అగ్ర హీరోలు, రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ సినిమాని గట్టెక్కిస్తుందేమో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -