కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు ముహూర్తం ఖరారైంది. ప్రధాని మోదీ తన కేబినెట్ ప్రక్షాళన తుది కసరత్తు చేస్తున్నారు. దాదాపు 14 మంది మంత్రులకు ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. రాజ్యసభ పదవీ కాలం పూర్తయిన వారికి ఇక పార్టీ బాధ్యతలను కేటాయించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలు… 2029 ఎన్నికలే లక్ష్యంగా ఎలక్షన్ టీం ను మోదీ సిద్దం చేస్తున్నారు. ప్రస్తుత మంత్రుల్లో కొందరి శాఖల మార్పు ఖాయంగా కనిపిస్తోంది.
కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన ఈ నెల 20వ తేదీ లోగా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో కొందరికి ఉద్వాసన తప్పదు. కేబినెట్ లోకి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ తో పాటుగా బీహార్ మాజీ సీఎం నితీశ్ చేరిక ఖాయమైంది. అదే విధంగా ఇద్దరు సీనియర్ మంత్రుల ను గవర్నర్లుగా పంపనున్నట్లు సమాచారం. ఏపీ నుంచి మరో మంత్రి పదవి కూటమి పార్టీలకు దక్కనుంది. తెలంగాణ నుంచి సైతం మరొకరికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మోదీ టీం లో మూడు శాఖల మంత్రుల్లో మాత్రం మార్పు ఉండదని చెబుతున్నారు. అమిత్ షా, రాజ్ నాధ్ సింగ్, నితిన్ గడ్కరీ తమ శాఖల్లోనే కొనసాగే అవకాశం ఉంది. కాగా.. నీట్ పరీక్షతో పాటుగా సీబీఎస్ఈ వివాదంతో విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ఆ శాఖ నుంచి తప్పించటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ శాఖను ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కేటాయిస్తారని బీజేపీ నేతల సమాచారం.
అదే విధంగా వాణిజ్య శాఖ పర్యవేక్షిస్తున్న పీయూష్ గోయల్ కు ఆర్దిక శాఖ అప్పగిస్తారని పార్టీలో చర్చ సాగుతోంది. ఇక.. రైల్వే మంత్రి అశ్విణీ వైష్ణవ్ కు వాణిజ్య శాఖ అప్పగించే ఛాన్స్ ఉందని సమాచారం. హౌసింగ్ మంత్రి మనోహర్ కట్టర్ కు గవర్నర్ గా అవకాశం దక్కనుందని తెలుస్తోంది. అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కు పార్టీ సంస్థాగత బాధ్యతలు కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. సహాయ మంత్రుల్లో నలుగురి మార్పు ఖాయమని తెలుస్తోంది. ఏడాది కాలంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను పరిగణలోకి తీసుకొని కేంద్ర మంత్రివర్గంలో మార్పులకు అవకాశం కనిపిస్తోంది. టెక్నాలజీ, ఆర్దిక వ్యవహారాల్లో పట్టున్న ఇద్దరు మాజీ బ్యూరోక్రాట్లకు సహాయక మంత్రులుగా అవకాశం దక్కనుందని తెలుస్తోంది. తెలంగాణలో సామాజిక సమీకరణాల ఆధారం గా మంత్రి పదవి ఖరారు చేయనున్నారు. ఈ నెల 10న జరిగే ఎన్డీఏ సమావేశం వేళ ప్రధాని మోదీ మిత్రపక్షాలకు కేబినెట్ ప్రక్షాళన.. భవిష్యత్ లక్ష్యాల పైన స్పష్టత ఇవ్వనున్నారు.
