Monday, May 6, 2024
- Advertisement -

ఒక‌డే ఒక్క‌డు మొన‌గాడు..అంద‌రు మెచ్చిన ఆట‌గాడు…

- Advertisement -

ఇంగ్లండ్‌ గడ్డపై చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ… గత పర్యటన నాటి ఆటగాడిని కానని నిరూపిస్తూ… తానెక్కడైనా రాణించగలనని చాటి చెబుతూ… ఎలాంటి పరిస్థితుల్లోనైనా వెన్నుచూపనని రుజువు చేస్తూ మ‌రో సారి తాను ఎంత విలువైన ఆట‌గాడినో నిరూపించుకున్నారు కోహ్లీ. ఒక వైపు వికెట్లు ప‌డుతున్నా ఓంట‌రిపోరాటంచేసి అజేయ శ‌త‌కంతో జ‌ట్టును ఆదుకున్నాడు.

ఇంగ్లాండు గ‌డ్డ‌పై కోహ్లీ క‌థం తొక్కాడు .కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అద్భుత పోరాటపటిమను ప్రదర్శించిన వేళ.. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో టీమ్‌ఇండియా పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుంది. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినా అతడి అద్వితీయ శతకంతో కోలుకుంది. మ్యాచ్‌ రెండో రోజు, గురువారం తొలి ఇన్నింగ్స్‌లో 100కే ఐదు వికెట్లు కోల్పోయిన భారత్‌.. విరాట్‌ కోహ్లి (149; 225 బంతుల్లో 22×4, 1×6) భారీ శతకంతో 274 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులకు ఆలౌటైన ఇంగ్లాండ్‌ కేవలం 13 పరుగుల ఆధిక్యంతో సరిపెట్టుకుంది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ కుక్‌ (0) వికెట్‌ కోల్పోయి 9 పరుగులు సాధించింది.

ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులు చేసిన కోహ్లీ ఇంగ్లండ్ గడ్డపై తొలి టెస్టు సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా ఇది 22వది. అంతేకాదు, టెస్ట్ కెప్టెన్‌గా సాధించిన 15వ సెంచరీ. కెప్టెన్లుగా అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (25), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీపాంటింగ్(19) ఉన్నారు. ఇప్పుడు 15 సెంచరీలతో కోహ్లీ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ సెంచరీతో కోహ్లీ సాధించిన అంతర్జాతీయ శతకాల సంఖ్య 57కు చేరుకుంది.

ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత భారత్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే, ఇంగ్లండ్ బౌలర్ శామ్ కర్రన్ ధాటికి భారత బ్యాట్స్‌మన్ క్రీజులో కుదురుకోలేకపోయారు. 100 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన సమయంలో కోహ్లీ సమయోచితంగా ఆడుతూ జట్టు బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. ఈ క్రమంలో సెంచరీ సాధించి జట్టు పరువు కాపాడాడు. మొత్తం 225 బంతులు ఎదుర్కొన్న విరాట్ 22 ఫోర్లు, సిక్సర్‌తో 149 పరుగులు చేశాడు. అయితే, కోహ్లీకి అండగా నిలిచేవారు కరువయ్యారు. దీంతో భారత్ 274 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది.

తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు మురళీ విజయ్ (20), శిఖర్ ధావన్ (26) కాసేపు క్రీజులో నిలిచినా.. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ (4), అజింక్య రహానె (15), దినేశ్ కార్తీక్ (0) నిరాశపరచడంతో భారత్ చూస్తుండగానే 100/5తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. ఈ దశలో హార్దిక్ పాండ్య (22)తో కలిసి కాసేపు స్కోరు బోర్డుని నడిపించిన కోహ్లి.. అనంతరం అశ్విన్‌ (10), ఇషాంత్ శర్మ (5)ల సాయంతో శతకానికి చేరువయ్యాడు. కోహ్లి 90లోకి వచ్చినప్పుడు ఇషాంత్ ఔటైనా.. అనంతరం వచ్చిన ఉమేశ్ యాదవ్ (1 నాటౌట్:16 బంతుల్లో) చక్కటి సహకారం అందించాడు. ఇన్నింగ్స్‌ 65వ ఓవర్ వేసిన బెన్‌స్టోక్స్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన కోహ్లి.. ఇంగ్లాండ్ గడ్డపై తన చిరకాల శతక స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. 2014 పర్యటనలో 10 ఇన్నింగ్స్‌లో కలిసి మొత్తం 143 పరుగులే చేసిన కోహ్లి.. తాజాగా ఒక ఇన్నింగ్స్‌లోనే అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం కొసమెరుపు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -