ఐసీసీ ఛైర్మన్ జైషా …టీ20 ప్రపంచకప్-2026 సందర్భంగా జరిగిన పరిణామాలపై తొలిసారిగా స్పందించారు. ముంబైలో జరిగిన ఇండియన్ బిజినెస్ లీడర్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఐసీసీ నిబంధనలు అన్ని దేశాలకు సమానంగా వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒక్క జట్టు కూడా బోర్డును ప్రభావితం చేయలేదని, సంస్థ ప్రయోజనాలు మరియు క్రీడా స్ఫూర్తే తమకు అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు కొన్ని వివాదాలు చోటుచేసుకున్నాయి. భద్రతా కారణాలను చూపిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్.. భారత్‌కు రావడానికి నిరాకరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించి వారి స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చిన నిర్ణయం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ క్రికెట్ టీమ్ తొలుత భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించినప్పటికీ, అనంతరం తమ నిర్ణయాన్ని మార్చుకుని టోర్నీలో పాల్గొంది.
టోర్నీ విజయవంతంగా ముగియడంపై జై షా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రపంచకప్ గత రికార్డులను తిరగరాసిందని ఆయన తెలిపారు. ఒకేసారి సుమారు 7.2 మిలియన్ల మంది లైవ్ వ్యూయర్లు మ్యాచ్‌లను వీక్షించారని, ఇది క్రికెట్ చరిత్రలోనే ఒక ప్రత్యేక మైలురాయి అని ఆయన చెప్పారు. అంతేకాకుండా పెద్ద జట్లతో పాటు యుఎస్‌ఏ, నెదర్లాండ్స్, జింబాబ్వే, నేపాల్ వంటి జట్లు కూడా బలమైన ప్రదర్శన చేసి టోర్నీ స్థాయిని మరింత పెంచాయని ఆయన ప్రశంసించారు.
చివరగా ప్రపంచకప్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లకు జై షా ప్రత్యేక సందేశం ఇచ్చారు. శిఖరాగ్రం చేరుకోవడానికి ఎన్నో సంవత్సరాల కష్టం అవసరం అవుతుందని, కానీ అక్కడి నుంచి కిందకు పడిపోవడానికి కొన్ని నెలలు చాలని ఆయన హెచ్చరించారు. అందుకే క్రమశిక్షణతో ముందుకు సాగుతూ విజయ పరంపరను కొనసాగించాలని సూచించారు.
అలాగే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 2028 ఒలింపిక్స్‌తో పాటు 2030, 2031, 2036 సంవత్సరాల వరకు భారత క్రికెట్ అభివృద్ధికి దూరదృష్టితో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
