Friday, April 26, 2024
- Advertisement -

‘విన‌య విధేయ రామ’ రివ్యూ

- Advertisement -

రంగ‌స్థ‌లం వంటి హిట్ త‌రువాత మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన చిత్రం విన‌య విధేయ రామ‌. క‌మ‌ర్షియ్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి ఈ సినిమాకు ద‌ర్శ‌కత్వం వ‌హింయ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.పైగా టీజ‌ర్‌,ట్రైలర్ బాగుండంటంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్ష‌కుల ముంద‌కు వ‌చ్చింది. మ‌రి ఫుల్ మాస్ మ‌సాలాగా తెర‌కెక్కిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఎలా మెప్పించిందో స‌మీక్ష ద్వారా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

క‌థ
ఐదుగురు అన్నదమ్ములున్న అందమైన ఫ్యామిలీలో అందరి కన్నా చిన్నవాడు రామ్. అత‌నంటే అంద‌రికీ ఇష్టం. అలాగే కుటుంబం అంటే రామ్ కూడా చాలా ఇష్టం. రామ్ పెద్ద‌న్న విశాఖ ఎలక్షన్ కమిషనర్‌గా ప‌నిచేస్తుంటాడు. అక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో పందెం పరశురాం అరాచ‌కాల‌ను రామ్ పెద్ద‌న్న బ‌య‌ట పెడ‌తాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుంది. అది నచ్చని పరశురాం.. రామ్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. అందుకు బిహార్‌లో ఉన్న మున్నాభాయ్‌ (వివేక్ ఒబెరాయ్‌) రంగంలోకి దింపుతాడు. మున్నాభాయ్ వ‌ల్ల రామ్ కుటుంబానికి ఎలాంటి న‌ష్టం జ‌రిగింది? అన్న‌య్య‌కు, త‌న కుటుంబానికి జ‌రిగిన అన్యాయాన్ని రామ్ ఎలా ఎదుర్కొన్నాడు? అన్న‌ది తెర‌పై చూడాల్సిందే!

విశ్లేష‌ణ‌
కుటుంబానికి జ‌రిగిన అన్యాయంపై ఒక త‌మ్ముడు చేసే పోరాట నేప‌థ్యంలో చాల‌నే సినిమాలు వ‌చ్చాయి. ఈ సినిమా కూడా అలాగే సాగేతోంది. సినిమాలో కొత్త‌గా చూపించ‌డానికి ఏమి లేదు. బోయ‌పాటి చిత్రాల్లో స‌హ‌జంగా యాక్ష‌న్ మోతాదు ఎక్కువ‌గా ఉంటుంది. అదే స‌మ‌యంలో కుటుంబ బంధాలు, అనుబంధాల‌ను చూపిస్తారు. ఈసారి కూడా అదే ఫార్ములాను ఆయ‌న ఎంచుకున్నారు. చ‌ర‌ణ్ బాగానే న‌టించాడు. ఇక యాక్ష‌న్ ఎపిసోడ్ల‌కు వ‌చ్చేస‌రికి మ‌రో స్థాయిలో చూపించే ప్ర‌య‌త్నం చేశారు బోయ‌పాటి. ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ల మూలంగా క‌థ బాగా న‌లిగిపోయింది. కొన్ని యాక్ష‌న్ సీక్వెన్స్ మ‌ధ్య క‌థ‌ను పేర్చుకుంటూ వెళ్లాడేమో అనిపిస్తుంది. కియారా అద్వానీతో కొన్ని స‌న్నివేశాలు, ఆఫీస్‌లో జ‌రిగే ఎపిసోడ్ల‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ అల‌రిస్తుంది. యాక్ష‌న్ సీక్వెన్స్ ముందు వ‌చ్చే స‌న్నివేశాల్లో భావోద్వేగాలు బాగా పండించాడు. హింస‌, ర‌క్త‌పాతం, హీరోయిజం మ‌రోస్థాయిలో ఉంటాయి. యాక్ష‌న్ కోస‌మే యాక్ష‌న్ అన్న‌ట్లు సెకండాఫ్ సాగుతుంది. ప్ర‌థ‌మార్ధంలో క‌నిపించే ఫ్యామిలీ డ్రామా, ఎమోష‌న్స్‌, ల‌వ్ సీన్లు, ఫ‌న్ ఇవేవీ క‌నిపించ‌వు. ఒక సీరియ‌స్ పంధాలో సాగుతుంది. బోయ‌పాటి గ‌త చిత్రాల‌న్నీ క‌లిపి క‌ట్టుగా చూసిన‌ట్లు అనిపిస్తుంది.

న‌టీ,న‌టుల ఫ‌ర్మామెన్స్‌
ర‌ంగ‌స్థ‌లం త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ ఇందులో ఒక ఎగ్రెసివ్ పాత్ర చేశాడు. రామ్ పాత్ర‌లో చాలా షేడ్స్ ఉంటాయి. ఫ్యామిలీ డ్రామా, ల‌వ్‌, ఫ‌న్‌, ఒక ఫైట‌ర్ ఇలా అనేక కోణాల్లో సాగుతుంది. అన్నింటిక‌న్నా ఫైట‌ర్ మాత్ర‌మే ఎలివేట్ అయ్యాడు. సిక్స్‌ప్యాక్ చేసి రామ్ చేసిన యాక్ష‌న్ స‌న్నివేశాలు అభిమానుల‌కు బాగా న‌చ్చుతాయి. కియారా అడ్వాణీ అందంగా క‌నిపించింది. అయితే, ఆమె పాత్ర‌కు అంత‌గా ప్రాధాన్యం లేదు. అన్న‌ద‌మ్ములుగా న‌టించిన ప్ర‌శాంత్‌, ఆర్య‌న్‌ రాజేష్‌, మ‌ధునంద‌న్‌, ర‌వివ‌ర్మ‌ తమ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ముఖ్యంగా ప్ర‌శాంత్‌కు ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. ఆర్య‌న్ రాజేష్ కూడా ఆక‌ట్టుకుంటాడు. ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టించిన వివేక్ ఒబెరాయ్ త‌న‌దైన శైలిలో బాగా న‌టించాడు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరు
దేవిశ్రీ ప్ర‌సాద్ పాట‌లు మాస్‌కు న‌చ్చేలా ఉన్నాయి. పాట‌ల్లో సాహిత్యం, బీట్ క‌న్నా రామ్‌చ‌ర‌ణ్ స్టెప్‌లు అభిమానుల‌ను మెప్పిస్తాయి. రంగ‌స్థలంలో పెద్ద‌గా స్టెప్‌లు వేసే అవ‌కాశం రాని చెర్రీ ఇందులో ఆ లోటు తీర్చుకున్నాడు. డైలాగ్‌లు మాస్‌కు బాగా న‌చ్చుతాయి. క‌థ‌కుడిగా బోయ‌పాటి.. రామ్‌కు స‌రిపోయే క‌థ‌ను మాత్రం ఎంచుకోలేక‌పోయాడ‌నిపిస్తుంది. సినిమా మొత్తం ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోనే సాగుతుంది. పాట‌.. ఫైటూ.. పాట‌.. ఫైటూ అన్న‌ట్లు సినిమా సాగుతుంది.

బోట‌మ్ లైన్‌:
రామ్ చ‌ర‌ణ్‌ను ముంచేసిన బోయ‌పాటి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -