Friday, April 26, 2024
- Advertisement -

సైరా మూవీ రివ్యూ

- Advertisement -

చిత్రం: సై రా నరసింహ రెడ్డి
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాత: రామ్ చరణ్
కథ: పరుచూరి బ్రదర్స్
డైలాగులు: సాయి మాధవ్ బుర్ర
స్క్రీన్ ప్లే: సురేందర్ రెడ్డి
తారాగణం: అమితాబచ్చన్, చిరంజీవి, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార, తమన్నా తదితరులు
పాటలు: అమిత్ త్రివేది
నేపథ్య సంగీతం: జూలియస్ ప్యాకీయం
ఛాయాగ్రహణం: ఆర్ రత్నవేలు
ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్
నిర్మాణసంస్థ: కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ
విడుదల తేదీ: అక్టోబర్ 2, 2019
సినిమా నిడివి: 171 నిమిషాలు
దేశం: ఇండియా
భాష: తెలుగు
బడ్జెట్: 270 కోట్లు

కథ:

సినిమా మొత్తం 1840 ల బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. 1847 లో ఒక పాలెగాడు బ్రిటిషర్ల కి వ్యతిరేకంగా విప్లవాన్ని ఎలా లేవదీశాడు అనే అనేదే ఈ సినిమా కథ. ఇక కథలోకి వెళితే, నరసింహారెడ్డి (మెగాస్టార్ చిరంజీవి) రాయలసీమలో ఉండే 61 పాలెగాళ్లలో ఒకడు. బ్రిటిష్ వారి కింద పని చేస్తూ, పన్నులు కడుతుంటారు. ఒకరోజు రాయలసీమ లో అతి పెద్ద కరువు ఏర్పడుతుంది. కానీ అలాంటి కష్ట సమయంలో కూడా బ్రిటిషర్లు నెల పై పన్ను కట్టాల్సిందే అని రుబాబు చేస్తారు. అక్కడ నరసింహ రెడ్డి మరియు బ్రిటిషర్ల కి మధ్య గొడవ ఏర్పడుతుంది. నరసింహారెడ్డి మిగతా పాలెగాళ్ళు మరియు ప్రజలతో కలిసి పోరాటానికి దిగుతారు. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన మొట్టమొదటి వీరుడు నరసింహ రెడ్డి. చివరికి ఏమైంది? అనేదే సినిమా కథ.

నటీనటులు:

సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటన అద్భుతంగా ఉంది. చిరు కాకుండా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా ఇంకా ఎవరూ ఆ స్థాయి పర్ఫార్మెన్స్ పలికించలేరేమో అన్నంత బాగా తన పాత్రలో ఒదిగిపోయి నటించారు చిరు. నటన పరంగా కానీ బాడీ లాంగ్వేజ్ పరంగా కానీ మాత్రమేకాక డైలాగ్ డెలివరీలో కూడా మెగాస్టార్ చిరంజీవి తన పర్ఫామెన్స్ లో చూపించిన ఇంటెన్సిటీ ఇంకా ఎవరూ చూపించలేరని చెప్పచ్చు. సుదీప్ కనబరిచిన అద్భుతమైన నటన ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో సుదీప్ నటన చాలా బాగుంటుంది. అమితా బచ్చన్ తెరపైన కనిపించేది తక్కువ సేపే అయినప్పటికీ తన పాత్ర కచ్చితంగా ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. నయనతార మరియు తమన్నా ఇద్దరి నటన సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యింది. తమ పాత్రలలో ఇద్దరు హీరోయిన్లు చాలా చక్కగా నటించారు. విజయ్ సేతుపతి తన పాత్రకి ప్రాణం పోసారు అని చెప్పుకోవచ్చు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి నటించే విజయ్ సేతుపతి ఈ సినిమాలో కూడా నటుడిగా చాలా మంచి నటనని కనపరిచారు. జగపతిబాబు కూడా ఈ సినిమాలో చాలా సహజంగా నటించారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు.

సాంకేతిక వర్గం:

చరిత్ర మర్చిపోయిన ఒక స్వాతంత్ర సమరయోధుడు కథని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన ఘనత సురేందర్ రెడ్డి కి దక్కింది. ఒక పవర్ఫుల్ కథను ఎంచుకోవడం మాత్రమే కాకుండా సురేందర్రెడ్డి తన నెరేషన్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉండే లాగా చూసుకున్నాడు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలలో ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి అంటే అతిశయోక్తి కాదు. ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు చాలా బాగా ఎలివేట్ చేశారు. థియేటర్లో నిజంగానే ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించడంలో సఫలమయ్యారు సురేందర్రెడ్డి. తను అనుకున్న ప్రతి ఎమోషన్ ని ప్రేక్షకులలో కలిగిస్తూ సినిమాని చాలా బాగా తెరకెక్కించారు. మాట ఇచ్చిన విధంగానే కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ ఈ సినిమాకి అద్భుతమైన నిర్మాణ విలువలు అందించారు. బడ్జెట్ పరంగా ఈ సినిమాకి చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. అమిత్ త్రివేది అందించిన సంగీతం వల్ల ఈ సినిమాకి మరింత బలం చేకూరింది. జులియస్ అందించిన నేపథ్య సంగీతం హాకీ మరింత బాగా వర్కౌట్ అయింది. సాయి మాధవ్ బుర్ర అందించిన డైలాగులకు ప్రేక్షకులు కచ్చితంగా చప్పట్లు కొడతారు. సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. తన కెమెరా పనితనంతో రత్నవేలు ప్రేక్షకుల్ని ఒక కొత్త ప్రపంచం లోకి తీసుకు వెళతారు. ఏ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది.

తీర్పు:

స్టార్ కాస్ట్ ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. అందరూ తమ పాత్రలలో ఒదిగిపోయి సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. కేవలం స్టార్ కాస్ట్ ని ఎంపిక చేసుకోవడం మాత్రమే కాకుండా దర్శకుడు అందరు నటీనటులు కి ప్రాధాన్యత ఇవ్వడం ఖచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందరో సాంకేతిక నిపుణుల అద్భుతమైన పనితీరు సినిమాలోని ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. పోరాట సన్నివేశాలను డిజైన్ చేసిన తీరు అద్భుతం. ముఖ్యంగా ఇంటర్వల్‌కు ముందు వచ్చే సన్నివేశం సినిమా స్థాయిని మరింత పెంచింది అని చెప్పచ్చు. సినిమా మొదటి హాఫ్ మొత్తం ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి ఎలా బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేస్తారని, ఎలా అతనికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా మద్దతు లభించిందనే అంశాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో కథ కూడా కొంచెం స్లో గా నడవడంతో ప్రేక్షకులకు బోర్ కొట్టచ్చు. కానీ చిరు తెరపై ఉన్నంతసేపు మాత్రం కన్నులవిందుగానే ఉంటుంది. రెండవ హాఫ్ లో వచ్చే సన్నివేశాలను చాలా బాగా తెరకెక్కించారు. ముఖ్యంగా నరసింహారెడ్డిని ఉరి తీసే సన్నివేశం అందరినీ కలచివేస్తుంది. యుద్ధ సన్నివేశాల్లోనూ మరియు కోర్టు సీన్ లోనూ చిరు డైలాగులు అదిరిపోయాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. చివరగా చరిత్ర మర్చిపోయిన ఒక మహానుభావుడి జీవిత చరిత్ర కి ప్రాణం పోసి ‘సై రా’ సినిమా తెలుగు సినీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచి ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -